నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

చండూరు, వెలుగు: రాష్ట్రంలో బైపోల్‌‌ ఎక్కడ వచ్చినా గెలిచేది బీజేపీ అభ్యర్థేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం చండూరు మండలం గట్టుప్పల్​లో పార్టీ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో, గల్లీలో ఎక్కడా లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి నిజాయతీగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని సూచించారు. పోయినసారి ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి 13 వేల ఓట్లు వచ్చాయని, ఈ సారి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 12 మంది పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి శుక్రవారం రూ. 17 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పదవులు ముఖ్యం కాదని, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న సీఎం కేసీఆర్‌‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో దోటి వెంకటేశ్‌‌ యాదవ్‌‌, కావలి అంజనేయులు, కోడి శ్రీనివాసులు, అనంతగిరి, అనంత శేఖర్, భూతరాజు వేణు, కడారి లక్ష్మయ్య పాల్గొన్నారు.ర్శి మాదగోని నరేందర్ గౌడ్, బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ పులకరం సైదులు తదితరులు పాల్గొన్నారు. 

సీఎంఆర్‌‌ను ఇన్‌‌టైంలో డెలివరీ చేయాలి

నల్గొండ అర్బన్‌‌, వెలుగు : పెండింగ్‌‌లో ఉన్న కస్టమ్‌‌ మిల్లింగ్‌‌ రైస్‌‌ను మిల్లర్లు ఇన్‌‌టైంలో ఎఫ్‌‌సీఐకి పంపించాలని నల్గొండ అడిషనల్‌‌ కలెక్టర్‌‌ భాస్కర్‌‌రావు ఆదేశించారు. శుక్రవారం మిల్లర్లతో నిర్వహించిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. 2020–21 యాసంగికి సంబంధించి 5,458 టన్నుల బియ్యం పెండింగ్‌‌లో ఉందని వాటిని ఈ నెల 25లోగా, 2021–22 వానాకాలానికి సంబంధించిన 1,35,063 టన్నుల బియ్యాన్ని 31లోగా అందజేయాలని సూచించారు. అలాగే 2021–-22 యాసంగికి చెందిన 88,456 టన్నుల బాయిల్డ్‌‌ బియ్యాన్ని ఈ నెల 22 నుంచి ఎఫ్‌‌సీఐకి పంపించాలని చెప్పారు.

గోడ కూలి యువకుడు మృతి

మిర్యాలగూడ, వెలుగు : కుక్క దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పొట్టెగాని తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన మాలోతు బాలాజీ (23) పని మీద బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కుక్క వెంటపడింది. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సమీపంలో ఉన్న గోడ ఎక్కి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ గోడ కూలి బాలాజీపై పడడంతో స్పాట్‌‌లోనే చనిపోయాడు.

పేషెంట్లు, ఖైదీలకు పండ్ల పంపిణీ

సూర్యాపేట/హుజూర్‌‌నగర్‌‌, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలోని సబ్‌‌జైలు, ప్రభుత్వ జనరల్‌‌ హాస్పిటల్‌‌లో శుక్రవారం కలెక్టర్‌‌ పాటిల్‌‌ హేమంత్‌‌ కేశవ్‌‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్, మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్‌‌ అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్‌‌పర్సన్‌‌ లలితా ఆనంద్‌‌ పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌‌ మాట్లాడుతూ నార్మల్‌‌ డెలివరీలపై గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ
 సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్, సూపరింటెండెంట్‌‌ డాక్టర్ మురళీధర్‌‌రెడ్డి, పీడీ. కిరణ్‌‌కుమార్‌‌, డీఎస్పీ నాగభూషణం, తహసీల్దార్‌‌ వెంకన్న పాల్గొన్నారు. అలాగే హుజూర్‌‌నగర్‌‌ సబ్‌‌జైలులో సీఐ రామలింగారెడ్డి, ఎస్సై వెంకట్‌‌రెడ్డి పండ్లు పంచారు. రైస్‌‌ మిల్లర్స్‌‌ అసోషియేషన్‌‌, రెవెన్యూ సిబ్బంది, రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో హుజూర్‌‌నగర్‌‌ ఏరియా హాస్పిటల్‌‌లో పేషెంట్లు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. 

ఆటల్లో బాలికలు రాణించాలె

యాదాద్రి, వెలుగు : ఆటల్లో బాలికలు ప్రతిభ చూపాలని యాదాద్రి కలెక్టర్‌‌ పమేలా సత్పతి సూచించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం స్థానికంగా నిర్వహించిన బాలికల ఆటల పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. పోటీతత్వం కారణంగా స్టూడెంట్స్‌‌లో పట్టుదల పెరుగుతుందన్నారు. ఆటలు ఆడడం వల్ల మానసిక, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఆఫీసర్లు ప్రశాంత్, అండాలు, విజయసాగర్, లక్ష్మీనారాయణ, నాగవర్దన్‌‌రెడ్డి, పూల నాగయ్య, మధుసూదన్‌‌ పాల్గొన్నారు.

హుజూర్‌‌నగర్‌‌ సీనియర్‌‌ సివిల్‌‌ జడ్జిగా శ్యాంకుమార్

హుజూర్‌‌నగర్‌‌, వెలుగు : హుజూర్‌‌నగర్‌‌ సీనియర్‌‌ సివిల్‌‌ జడ్జిగా జే.శ్యాంకుమార్‌‌ నియామకం అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న సీహెచ్‌‌ఏఎన్‌‌.మూర్తి హన్మకొండ అదనపు సీనియర్‌‌ సివిల్‌‌ జడ్జిగా ట్రాన్స్‌‌ఫర్‌‌ చేస్తూ హైకోర్టు విజిలెన్స్‌‌ రిజిస్ట్రార్‌‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఆయన స్థానంలో ప్రస్తుతం కోరుట్లలో జూనియర్‌‌ సివిల్‌‌ జడ్జిగా పనిచేస్తున్న శ్యాంకుమార్‌‌ ప్రమోషన్‌‌పై హుజూర్‌‌నగర్‌‌కు రానున్నారు.

అమ్మనబోలును మండలం చేయాలి

నార్కట్‌‌పల్లి, వెలుగు : అమ్మనబోలును మండల కేంద్రంగా ప్రకటించాలని బీఎస్పీ నకిరేకల్‌‌ నియోజకవర్గ ఇన్‌‌చార్జి ప్రియదర్శిని డిమాండ్‌‌ చేశారు. మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షకు శుక్రవారం ఆమె మద్దతు తెలిపి మాట్లాడారు. ఇక్కడి ప్రజలు వివిధ పనుల కోసం 20 కిలోమీటర్లు ఉన్న నార్కట్‌‌పల్లికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు. 
ప్రజలు 27 రోజులుగా దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అమ్మనబోలు మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆమె వెంట బీఎస్పీ జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ అధ్యక్షుడు గద్దపాటి రమేశ్‌‌, మండల కన్వీనర్‌‌ చెరుకుపల్లి మీనయ్య, మండల సాధన సమితి నాయకులు, సర్పంచ్‌‌ బద్దం వరలక్ష్మి రాంరెడ్డి, ఎంపీటీసీ కొంపెల్లి సైదులు, గిన్నెల శివప్రసాద్ పాల్గొన్నారు.

టీఆర్‌‌ఎస్‌‌ సభను సక్సెస్‌‌ చేయాలి

చౌటుప్పల్‌‌, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడులో శనివారం నిర్వహించే ప్రజాదీవెన సభను సక్సెస్‌‌ చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌లో శనివారం నిర్వహించిన టీఆర్‌‌ఎస్‌‌ ముఖ్య కార్యకర్తల మీటింగ్‌‌లో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌‌లో ఉన్నప్పుడు అభివృద్ధి చేయని రాజగోపాల్‌‌రెడ్డి బీజేపీలో చేరి ఏం సాధిస్తాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ ఆదర్శవంతంగా నిలుస్తోందన్నారు. అనంతరం జైకేసారానికి చెందిన పలువురు నాయకులు టీఆర్‌‌ఎస్‌‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌‌ఎస్‌‌ మండల అధ్యక్షుడు నిరంజన్‌‌గౌడ్‌‌, చౌటుప్పల్‌‌ పట్టణ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌‌రెడ్డి, డెబోయిన వెంకటేశ్‌‌యాదవ్‌‌, మున్సిపల్‌‌ చైర్మన్‌‌ వెన్‌‌రెడ్డి రాజు, అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌ కమిటీ చైర్మన్‌‌ బొడ్డు శ్రీనివాస్‌‌రెడ్డి పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌‌ఏల భిక్షాటన

సూర్యాపేట, వెలుగు : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌‌ చేస్తూ వీఆర్‌‌ఏలు శుక్రవారం సూర్యాపేటలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం రాష్ట్ర వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ మీసాల సునీల్‌‌ గవాస్కర్‌‌ మాట్లాడుతూ వీఆర్‌‌ఏలకు పే స్కేల్‌‌ ఇస్తామని రెండేళ్ల క్రితం హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. పే స్కేల్‌‌ అమలు చేయడంతో పాటు వారసులకు ఉద్యోగాలు, అర్హత గల వారికి ప్రమోషన్లు 
ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏల జిల్లా కో చైర్మన్‌‌ మామిడి సైదులు, శ్రీనివాసులు, తండు నగేశ్‌‌, సంతోశ్‌‌రెడ్డి, నజీర్, శ్రీను, నాగరాజు, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

16 గేట్ల నుంచి నీటి విడుదల

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్ట్‌‌కు ఇన్‌‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి 1,74,167 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 16 గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి 1,23,216 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.20 అడుగుల నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి ఎడమ కాల్వకు 8,831క్యూసెక్కులు, కుడికాల్వకు 8,193, ఎస్‌‌ఎల్‌‌బీసీకి 600, వరదకాల్వకు 300, మెయిన్‌‌ పవర్‌‌ హౌజ్‌‌ ద్వారా 32,927 క్యూసెక్కుల నీటిని రిలీజ్‌‌ చేస్తున్నారు.

రైతులు ఈ – కేవైసీ చేయించుకోవాలి

పెన్‌పహాడ్‌, వెలుగు : ప్రతి రైతు పీఎం కిసాన్‌ ఈ కేవైసీని చేయించుకోవాలని సూర్యాపేట జిల్లా అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ రామారావు నాయక్‌ సూచించారు.  పెన్‌పహాడ్‌ మండలం చీదెళ్లలో పంటల నమోదు, పీఎం కిసాన్‌ ఈ–కేవైసీ నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ–కేవైసీ చేయించుకోవడానికి ఆగస్టు 31 లాస్ట్‌ డేట్‌ అన్నారు. పంటల నమోదు ప్రక్రియను అగ్రికల్చర్‌ ఆఫీసర్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండల వ్యవసాయాధికారి బి.కృష్ణ సందీప్‌, ఎంపీటీసీ జూలకంటి వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెన్న సీతారాంరెడ్డి, ఏఈవో మనోజ్, మాజీ సర్పంచ్‌ వెంకన్న పాల్గొన్నారు.

హుజూర్‌‌నగర్‌‌ సీనియర్‌‌ సివిల్‌‌ జడ్జిగా శ్యాంకుమార్

హుజూర్‌‌నగర్‌‌, వెలుగు : హుజూర్‌‌నగర్‌‌ సీనియర్‌‌ సివిల్‌‌ జడ్జిగా జే.శ్యాంకుమార్‌‌ నియామకం అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న సీహెచ్‌‌ఏఎన్‌‌.మూర్తి హన్మకొండ అదనపు సీనియర్‌‌ సివిల్‌‌ జడ్జిగా ట్రాన్స్‌‌ఫర్‌‌ చేస్తూ హైకోర్టు విజిలెన్స్‌‌ రిజిస్ట్రార్‌‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఆయన స్థానంలో ప్రస్తుతం కోరుట్లలో జూనియర్‌‌ సివిల్‌‌ జడ్జిగా పనిచేస్తున్న శ్యాంకుమార్‌‌ ప్రమోషన్‌‌పై హుజూర్‌‌నగర్‌‌కు రానున్నారు.

దంపతుల ఆత్మహత్యాయత్నం

మిర్యాలగూడ, వెలుగు : కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్‌‌పహాడ్‌‌లో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బానోతు రమేశ్‌‌, జ్యోతికి ఐదు నెలల క్రితం వివాహమైంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వడంతో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వాడపల్లి పోలీసులు తెలిపారు.

గుట్టలో నేటి నుంచి శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్టలో ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజులపాటు శ్రీకృష్ణాష్టమి కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఈవో గీతారెడ్డి శుక్రవారం తెలిపారు. 22న సాయంత్రం 4.30 గంటలకు ఉట్లోత్సవం, రాత్రి 7.45 గంటలకు రుక్మిణీ కల్యాణం ఉంటాయన్నారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఈ నెల 20న స్వామివారి నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమం, మధ్యాహ్న భోగం, ఆన్ లైన్ కైంకర్యాల వంటి పూజలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

బాలికపై అత్యాచారం

హాలియా, వెలుగు: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలానికి చెందిన బాలిక(12)కు మతిస్థిమితం సక్రమంగా లేదు.  ఈ నెల 13న బాలిక ఒంటరిగా ఉండడం గమనించిన అదే గ్రామానికి చెందిన కటికర్ల వెంకటయ్య(50) మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి బాలిక తల్లి శుక్రవారం పెద్దవూర పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బాధితురాలిని పోలీసులు నల్గొండలోని భరోసా సెంటర్ కు తరలించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై 
పరమేశ్​చెప్పారు.