బుల్లెట్లు పేల్చే టైమ్ క్లోజ్.. ఇక ఆయుధాలు వదలండి: మావోయిస్టులకు అమిత్ షా కీలక పిలుపు

బుల్లెట్లు పేల్చే టైమ్ క్లోజ్.. ఇక ఆయుధాలు వదలండి: మావోయిస్టులకు అమిత్ షా కీలక పిలుపు

రాయ్‎పూర్: భద్రతా దళాల చేతిలో వరుస ఎదురుదెబ్బలు తింటోన్న మావోయిస్టులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక పిలుపునిచ్చారు. మావోయిస్టు సోదరులు ఇక ఆయుధాలు వదిలి.. జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. శనివారం (ఏప్రిల్ 5) ఛత్తీస్ గఢ్‎లోని దంతేవాడ జిల్లాలో అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా దంతేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రతా దళాల ఉన్నతాధికారులతో అమిత్ షా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి సుస్థిరమైన భారత్ మోడీ సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు. 

ఛత్తీస్‎గఢ్‎లో బుల్లెట్లు పేల్చే టైం అయిపోయిందని.. మావోయిస్టు సోదరులు ఇక ఆయుధాలు వదిలాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నక్సలైట్ రహిత గ్రామాల అభివృద్ధి కోసం కోటి రూపాయల నిధి కేటాయిస్తామని తెలిపారు. బస్తర్‌లో నక్సలిజం అంతమయ్యే దశలో ఉందని.. 2026 మార్చి నాటికి భారత దేశంలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని పునరుద్ఘాటించారు. 

‘‘గత మూడు నెలల్లో 521 మంది నక్సల్స్ లొంగిపోయారు. 2024లో మొత్తం 881 మంది నక్సల్స్ జన జీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నేను మీకు హామీ ఇస్తున్నా. కానీ ఆయుధాలు మోసే మావోయిస్టులను భద్రతా దళాలు తగిన రీతిలో ఎదుర్కొంటాయి. బస్తర్ ఇకపై భయానికి చిహ్నం కాదు. భవిష్యత్తుకు చిహ్నం’’ అని హాట్ కామెంట్స్ చేశారు అమిత్ షా. కాగా, 2026 మార్చి నాటికి భారత్‎ను నక్సల్ రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన భద్రతా దళాలు మావోయిస్టుల కంచుకోట దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరుగుతోన్న ఎదురు కాల్పుల్లో నక్సలైట్లకు భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గడిచిన మూడు నెలల్లోనే దాదాపు 300 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, ఇతర కీలక నేతలు ఉండటం గమనార్హం. చలపతి, సుధాకర్, రేణుక వంటి అగ్ర నాయకుల మరణంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.