ఒడిశా బీజేపీ కైవసం..78 సీట్లలో కమలం విక్టరీ

ఒడిశా బీజేపీ కైవసం..78 సీట్లలో కమలం విక్టరీ

నవీన్ పట్నాయక్ 25 ఏండ్ల పాలనకు చెక్.. హింజిలిలో సీఎం ఓటమి

భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 147 సీట్లలో 78 చోట్ల గెలుపొందింది. అప్రతిహతంగా 25 ఏండ్లు పాలించిన ముఖ్యమంత్రి నవీన్  పట్నాయక్ కు బీజేపీ చెక్  పెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్  మార్కు 74. బీజేపీ ఇప్పటికే ఆ మార్కు దాటిపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయ మైపోయింది. ఇక బిజూ జనతా దళ్ (బీజేడీ) 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొంది రెండో స్థానంలో నిలిచింది.

రెండు అసెంబ్లీ సీట్లలో పోటీచేసిన సీఎం నవీన్  పట్నాయక్.. కాంటాబంజిలో ఓడిపోగా.. హింజిలిలో గెలుపొందారు. అలాగే ఎనిమిది మంది కేబినెట్  మంత్రులు కూడా ఓడిపోయారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రదీప్  కుమార్  అమత్, ప్రజాపనుల శాఖ మంత్రి ప్రఫుల్ల కుమార్  మల్లిక్, ఉన్నత విద్యా శాఖ మంత్రి అతను సవ్యసాచి నాయక్, రవాణా శాఖ మంత్రి తుకుని సాహు, సైన్స్  అండ్  టెక్నాలజీ మంత్రి అశోక్  చంద్ర పాండా, ఆర్థిక శాఖ మంత్రి విక్రమ్  కేసరి అరూఖా, హ్యాండ్లూమ్స్  అండ్  టెక్స్ టైల్స్  మంత్రి రీటా సాహు, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి వసంతి హెంబ్రాన్  ఓటమి పాలయ్యారు.

ఇక కాంగ్రెస్  14, సీపీఎం 1, ఇండియా పార్టీ 3 స్థానాల్లో గెలుపొందాయి. సీపీఎం అభ్యర్థి, సిట్టింగ్  ఎమ్మెల్యే లక్ష్మణ్​ ముండా.. బోనాయ్  అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపొందారు. అలాగే ఇండిపెండెంట్  క్యాండిడేట్  సౌమ్యారాజన్  పట్నాయక్.. ఘస్నీపురలో బీజేడీ అభ్యర్థి బద్రీనారాయణ్  పాత్రపై విజయం సాధించారు. కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో భువనేశ్వర్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు షురూ అయ్యాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకొని మిఠాయిలు పంచుకున్నారు. ఇక 2000 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న బీజేడీ.. ప్రతిపక్షంలో కూర్చోనుంది.

లోక్​సభ ఎన్నికల్లోనూ  బీజేపీదే హవా

ఒడిశా లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ హవా సాగింది. ఇక్కడ మొత్తం 21 లోక్ సభ సీట్లలో 20 చోట్ల బీజేపీ గెలుపొందింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. సంభల్‌ పూర్ లో 1,12,984 ఓట్లతో తన సమీప బీజేడీ ప్రత్యర్థి ప్రణబ్  ప్రకాష్​ దాస్ పై విజయం సాధించారు. బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్  పాత్ర.. పూరీలో విజయ దుందుభి మోగించారు. 93,555 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి, బీజేడీ అభ్యర్థి అరూప్  పట్నాయక్ పై సంబిత్  గెలుపొందారు.

అలాగే భువనేశ్వర్  లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్  అపరాజిత సారంగి.. బీజేడీ అభ్యర్థి మన్మోత్  రౌత్రేపై 32,282 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వైజ యంతి పండా.. బీజేడీ అభ్యర్థి అన్షుమన్  మొహంతిపై 23,507 ఓట్ల తేడాతో గెలుపొందారు. బెర్హంపూర్, అస్కా, జగత్ సింగ్ పూర్, ధెన్ కనాల్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్ భంజ్, కియోం ఝర్, సుందర్ గఢ్, బార్ గఢ్, బోలంగిర్, నాబారంగ్ పూర్, కలహండి లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఇక బీజేడీ అభ్యర్థి శర్మిష్ఠ సేథీ.. జైపూర్ లో 3,637 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రవీంద్ర నారాయణ్​ బెహ్రాపై గెలుపొందారు. కాంగ్రెస్  క్యాండిడేట్  సప్తగిరి ఉలాకా.. కోరట్ పూర్ లో 92,524 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, బీజేడీ అభ్యర్థి కౌశల్య హికాకాను ఓడించారు.