- మిగతా ప్రజలందరికి నిరాశ కలిగించింది
- పాత దారుల్లో బీజేపీ ప్రభుత్వం.. 6శాతం వృద్ధిరేటు కష్టమేనని వ్యాఖ్య
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ బిహార్అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజం పొందడం కోసం రూపొందించినట్లు ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శించారు. దేశంలోని మిగతా ప్రాంతాల వారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఓదార్పు మాటలే తప్ప ఇంకేమి ఇవ్వలేదన్నారు. బిహార్లోని 7.65 కోట్ల మంది, ఆదాయ పన్ను ప్రయోజనం పొందనున్న వారికి తప్ప దేశ ప్రజలందరికి ఈ బడ్జెట్ నిరాశ కలిగించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం పాతదారుల్లోనే ప్రయాణిస్తున్నదని.. 1991, 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లాగా దేశ ప్రజలు తమ పరిస్థితుల నుంచి విముక్తి పొందేలా వ్యవహరించేందుకు సిద్ధంగా లేదన్నారు.
ఈ బడ్జెట్లో ప్రకటించిన విధానాలతో ఆర్థిక వ్యవస్థ పాత మార్గాల్లోనే వెళ్తుందని.. అవి 6 శాతం లేదా 6.5 శాతం వృద్ధిని అందివ్వలేవని అన్నారు. ప్రజలపై నియంత్రణను తొలగించేందుకు ఆర్థిక మంత్రి సిద్ధంగా లేరని దీంతో స్పష్టమువుతుందన్నారు. ప్రజల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభుత్వం పట్టు మరింత పెంచేలా విధానాలు రూపొందిస్తున్నారని విమర్శించారు. బడ్జెట్లో ద్రవ్యలోటు అంచనా 4.9 శాతం నుంచి సవరించిన అంచనా 4.8 శాతానికి వచ్చిందని.. ఇది సంతోష పడాల్సినంత గొప్ప మార్పేమీ కాదని అన్నారు. కొత్త పథకాలకు ప్రణాళిక రచించి వాటిని అమలు చేసి లక్ష్యాలను సాధిస్తుందనే నమ్మకం ఈ ప్రభుత్వంపై కలగడం లేదన్నారు.