బీజేపీ ఎజెండా బీసీలకు అండ

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు బీసీ కులాలకు చెందిన ఒక్క వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు. తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్​ పార్టీ దాదాపు అర్ధ శతాబ్దం పాలించగా, మిగిలిన కాలం అగ్రవర్ణ కుటుంబ, ప్రాంతీయ పార్టీలు ఏలాయి. ఆయా పార్టీల్లో బీసీలు నాయకులుగా, మంత్రులుగా ఎదిగారు. కానీ వారు తమ పదవీకాలం మొత్తం సీఎంలను సంతోషపరచడానికి పనిచేశారు తప్ప ఈ రాష్ట్రాన్ని పాలించాలనే కనీస ప్రయత్నం చేయలేదు. అభివృద్ధి, ఆత్మగౌరవం, స్వయంపాలన ఆకాంక్షలతో  సబ్బండ వర్గాలు జేఏసీలుగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడాయి. కానీ స్వరాష్ట్రంలో అధికారం చేతబట్టిన కేసీఆర్ మాత్రం బహుజన వ్యతిరేక విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. బీసీ ఉద్యమకారులను, నాయకులను, పార్టీలను వాడుకొని వదిలేయడం అలవాటు చేసుకొని, ఫ్యూడల్ ​విధానాలను అమలుపరుస్తూనే ఉన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా ఎదిగితే తన సీఎం పదవి, రాజ్యం పోతుందని ఆయన భయపడుతున్నారు. గత తొమ్మిదేండ్లలో తన అధికారాన్ని వాడుకొని బీసీలపై ఆయన కుట్రలు చేస్తున్నారు.

ఆర్థికంగా..

రాష్ట్రంలో 70 శాతానికి పైగా బీసీ కులాల కుటుంబాలు గుంట భూమి లేక తమ సాంప్రదాయ కులవృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మొదటి టర్మ్ లో 2018 ఎలక్షన్ల ముందు బీసీ కులాల ఫెడరేషన్, కార్పొరేషన్ ల ద్వారా నామమాత్రపు ఆర్థిక సాయం చేసింది. రెండో దఫా ప్రభుత్వంలో బీసీ ఫెడరేషన్, కార్పొరేషన్ నిధులను బడ్జెట్లో కేటాయింపులే తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కరోనా కష్టకాలంలో బీసీలు ఉపాధి కోల్పోతే.. తెలంగాణ ప్రభుత్వం కనీసం వారిని ఆదుకోలేదు.

విద్యాపరంగా ..

తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో విద్యార్థులదీ కీలక పాత్ర. వారి ఉద్యమస్ఫూర్తితోనే రాజకీయ పార్టీలు, నాయకులు ఉద్యమాలు నడిపించారు. విద్యార్థుల చైతన్యాన్ని గ్రహించిన కేసీఆర్ ప్రభుత్వ విద్యాసంస్థలైన ప్రభుత్వ యూనివర్సిటీలను , కాలేజీలను, బడులను తొమ్మిదేండ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 60 శాతానికి పైగా చదువుకునేది బీసీ బిడ్డలే. వారికి ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రియింబర్స్​మెంట్​సకాలంలో ఇవ్వడం లేదు. బడుల్లో టీచర్ల నియామకం, వర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలు జరపడం లేదు. మన ఊరు మన బడి లాంటి స్కీములు తెచ్చినా.. నేటికి రాష్ట్రంలో మెజార్టీ సర్కారు బడుల్లో తాగునీరు, టాయిలెట్స్, తరగతి గదులు, ప్రహరీలు లేవు. సంక్షేమ హాస్టళ్లలో భోజనం బాగలేక విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ.. మరో వైపు తమ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థలకు భూములు, అనుమతులు, రాయితీలు కల్పిస్తున్నది ఈ ప్రభుత్వం. ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు ఇస్తూ.. బీసీలకు విద్యను దూరం చేస్తున్నది. 

సామాజికంగా..

తెలంగాణలోని బీసీ కులాల్లో ఆర్థికంగా, సంఖ్యాపరంగా, రాజకీయంగా తారతమ్యాలు ఉన్నాయి. దీనికి తోడుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కులాల మధ్య వైరుధ్యాలను, ఘర్షణ వాతావరణాన్ని కల్పించడం, సంఖ్యాపరంగా బలంగా ఉన్న కులాలకు అధిక ప్రాధాన్యత కల్పించడం, అల్పసంఖ్యాకులైన సంచార జాతుల ఎంబీసీ కులాలను పూర్తిగా విస్మరించడం చేస్తున్నది. సంచార జాతుల కులాలను ఉద్దేశపూరితంగా ఎంబీసీ కులాలుగా ప్రకటించింది. దీంతో సంచార జాతుల, ఎంబీసీ కులాల ఆత్మ గౌరవాన్ని, అస్తిత్వాన్ని, అభివృద్ధికి ఆటంకం కలిగించింది.

బీజేపీ అంత్యోదయ సిద్ధాంతం

రాజ్యాధికారంలో వాటా, అభివృద్ధి, సంక్షేమంలో అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగా రాజ్యాంగ స్ఫూర్తితో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నది. దీన్ని బలపరచడానికి అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. 75 ఏండ్ల గణతంత్ర భారత చరిత్రలో బీజేపీ ప్రభుత్వం మొట్టమెదటి సారి బీసీ కులానికి చెందిన వ్యక్తికి ప్రధానిగా అవకాశం కల్పించింది. ప్రధానిగా మోడీ తన క్యాబినెట్​లో బీసీ కులాలకు చెందిన 27 మంది  ఎంపీలకు మంత్రులుగా స్థానం  కల్పించి సామాజిక న్యాయానికి సరైన అర్థం తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఓబీసీ కులాలకు చెందిన సీనియర్ నాయకులను ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా నియమించింది. 102 రాజ్యాంగ సవరణతో బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించింది.105 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫెడరల్ స్ఫూర్తిని గౌరవిస్తూ.. ఓబీసీ కులాలను గుర్తించే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను నిర్వచించే ఆర్టికల్ 366(26 సీ)ని రాజ్యాంగంలో పొందుపరిచింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్​కు రాజ్యాంగ హోదా కల్పించి.. చైర్మన్, సభ్యులుగా వివిధ బీసీ కులాలకు చెందిన వారిని నియమించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగ రంగాల్లో  27 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లు ఇప్పటివరకు ఉపయోగించుకున్నది కేవలం14 శాతం మాత్రమే. జాతీయ బీసీ కమిషన్ ఏర్పడ్డాక కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగ రంగంలో గత నాలుగేండ్లలో 14 శాతం నుంచి ఇప్పుడు 21 శాతానికి అమల్లోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా ‘లా’ యూనివర్సిటీల్లో ఓబీసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్ తో అడ్మిషన్లు పొందారు. ఈ రిజర్వేషన్​తో నీట్​ద్వారా ఏటా 4500 మందికి మెడికల్​సీట్లు, దాదాపు 4 లక్షల ఓబీసీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్స్​పొందుతున్నారు. ఓబీసీ కులాల్లోని సామాజిక, రాజకీయ విద్య, ఉద్యోగపరమైన అంతరాలను గ్రహించి అన్ని కులాలకు సమన్యాయం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసింది. ఎలాంటి గుర్తింపునకు నోచుకోని సంచారజాతుల సమగ్ర అభివృద్ధి  కోసం కేంద్ర ప్రభుత్వం ‘సంచార జాతుల అభివృద్ధి, సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేసింది.

కౌశల్​ వికాస్​ యోజన

ఓబీసీ కులాల చెందిన 140 చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం, వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణ, మార్కెటింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన’ ఏర్పాటు చేసింది. ఓబీసీ యువత పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కార్యక్రమం చేపట్టి, వేలాది కోట్ల రుణాలు ఇస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్​తోపాటు, కుటుంబ, వారసత్వ ప్రాంతీయ పార్టీలు బీసీలను ఓటర్లుగా మాత్రమే చూశాయి. వారసత్వ రాజకీయ మనస్తత్వంతో ఉన్న పార్టీలతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం సిద్ధంగా ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటాను కల్పించే పార్టీ కోసం వేచి చూస్తున్నారు. 

రాజకీయంగా.. 

టీఆర్ఎస్  మొదటి దఫా ప్రభుత్వంలో నలుగురు బీసీలకు, రెండో దఫాలో ముగ్గురికి మాత్రమే మంత్రివర్గంలో చోటిచ్చారు. ఈ రెండు పర్యాయాలు బీసీల నుంచి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. తన సామాజిక వర్గానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ముఖ్యమైన మంత్రిగా కేటీఆర్, ఇద్దరు మంత్రులను మొత్తంగా నలుగురికి కీలకమైన శాఖలతో క్యాబినెట్​లో స్థానం ఇచ్చుకున్నారు. శాసనమండలిలో బీసీ ఎమ్మెల్సీల సంఖ్య పదిలోపే, నామినేటెడ్ పోస్టుల్లో బీసీ చైర్మన్ ల సంఖ్య కూడా నామమాత్రమే, అత్యధిక పోస్టులను రెండు అగ్రవర్ణాలకు(రెడ్డి, వెలమ)కు చెందినవారికి ఇచ్చారు. స్థానిక సంస్థల్లో ఉన్న 33% బీసీ రిజర్వేషన్లను దాదాపు పది శాతం పైగా ఉద్దేశపూర్వకంగా తగ్గించింది ఈ ప్రభుత్వం.దీనికి తోడు మైనార్టీ ముస్లింలకు కూడా బీసీ రిజర్వేషన్లు కల్పించడంతో హిందూ బీసీలకు దక్కుతున్న రిజర్వేషన్లు 20 శాతం లోపే. అర్బన్ లోకల్ బాడీస్ లో బీసీ కోట కింద మైనార్టీ ముస్లింలను చైర్మన్లుగా, వైస్ చైర్మన్ గా , కో ఆప్షన్ మెంబర్లుగా నియమించి, హిందూ బీసీలకు గండి కొట్టింది కేసీఆర్ ప్రభుత్వం. బీసీ కులాల కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు పాలక మండళ్లను నియమించలేదు. 


–సూర్యపల్లి శ్రీనివాస్,స్టేట్ కన్వీనర్, బీజేపీ ఓబీసీ పాలసీ అండ్ రీసెర్చ్, తెలంగాణ