![బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయ్ : అంజిరెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/bjps-anji-reddy-accuses-brs-congress-of-cheating-graduates-and-unemployed-in-telangana_sP2mXI0oFR.jpg)
- గ్రాడ్యుయేట్స్ బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అంజిరెడ్డి
కరీంనగర్, వెలుగు : గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీజేపీ క్యాండిడేట్ చిన్నమైల్ అంజిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ రెండు పార్టీల నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలయ్యారని అన్నారు. ఈ ఎన్నికలు విద్యావంతులైన ఓటర్లకే కాకుండా రాష్ట్ర భవిష్యత్‌కు కూడా కీలకం అన్నారు.
నిరుద్యోగులకు ప్రతి నెల రూ. 4 వేల భృతి ఇస్తామన్న కాంగ్రెస్ ఆ హామీని ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు. గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని సూచించారు. తనకు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, మాజీ మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు
కరీంనగర్/నల్గొండ, వెలుగు : గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కలిపి మొత్తం 30 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి 28 మంది, టీచర్స్ స్థానానికి ఇద్దరు నామినేషన్లు వేశారు. రెండు స్థానాలకు కలిపి ఇప్పటివరకు మొత్తం 58 మంది నామినేషన్లు వేయగా, ఇందులో 49 మంది గ్రాడ్యుయేట్ స్థానానికి, 9 మంది టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్లు వేశారు.
శుక్రవారం కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి కాంగ్రెస్ క్యాండిడేట్ వి.నరేందర్‌రెడ్డి, బీజేపీ క్యాండిడేట్ చిన్నమైల్ అంజిరెడ్డితో పాటు పలువురు నామినేషన్లు అందజేశారు. అలాగే నల్గొండ నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీకి శుక్రవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి, పింగిలి శ్రీపాల్, గాల్‌రెడ్డి హర్షవర్షన్‌రెడ్డితో పాటు పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్ నామినేషన్లు వేశారు.