మునుగోడులో కొత్త ఓట్లపై హైకోర్టులో బీజేపీ వాదన

  • పాత ఓటర్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకారమే పోలింగ్‌‌‌‌‌‌‌‌కు ఆదేశాలివ్వాలి
  • కొత్త ఓట్ల నమోదు ప్రాసెస్ చెప్పాలని ఈసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో ఎట్లాగైనా గెలవాలనే కుట్రతో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ 25 వేలకుపైగా బోగస్​ ఓట్లు నమోదు చేయించిందని బీజేపీ వేసిన రిట్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 1474 కొత్త ఓట్ల నమోదు జరగ్గా.. ఉపఎన్నిక జరుగుతుందని తెలియగానే గత రెండు నెలల్లో ఆ సంఖ్య అనూహ్యంగా 25,781కి పెదిగింది. దీనిపై బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి దాఖలు చేసిన రిట్‌‌‌‌‌‌‌‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కొత్త ఓటర్ల నమోదుకు అనుసరించే ప్రాసెస్ ఏమిటో శుక్రవారం జరిగే విచారణలో చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్లాన్ ​ప్రకారం దొంగ ఓట్ల నమోదు

పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ బి.రచనారెడ్డి వాదిస్తూ.. మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ ఎస్​పార్టీ అడ్డదారిలో దొంగ ఓట్లను చేర్పించిందన్నారు. రెండు నెలల్లోనే 25781 కొత్త ఓట్లు నమోదు కావడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని కోరారు. జులై 31వ తేదీ నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికల నిర్వహణకు ఈసీకి ఆదేశాలివ్వాలన్నారు. ఈ నెల 14వ తేదీన ఈసీ కొత్త ఓటర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించకముందే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఫారం–6, 7, 8 ద్వారా 25781 మంది కొత్త వాళ్లు దరఖాస్తు పెట్టుకున్నారని, వీటిని ఆమోదిస్తే రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకం అవుతుందన్నారు. 2022 జనవరి 1 నుంచి జులై 31 నాటికి మునుగోడు, చండూర్‌‌‌‌‌‌‌‌ మండలాల్లో ఫారం–6,7,8 కింద వరసగా 1474 మంది ఓట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నట్లు అధికారులు సమాచార హక్కు చట్టం కింద పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు చెప్పారన్నారు. ఈ నెల 10న అఖిలపక్ష సమావేశంలో జిల్లా ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసరైన కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన లెక్కల ప్రకారం 24,781 దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారని, ఒక ప్లాన్​ప్రకారం జరుగుతున్న దొంగ ఓట్లను చేర్పించే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా జరిగిన అధికార దుర్వినియోగ చర్యలను అడ్డుకోవాలన్నారు. జులై 31 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదికపైనే నవంబర్‌‌‌‌‌‌‌‌ 3న మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిపేలా ఈసీకి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

40 % అప్లికేషన్లు తిరస్కరించాం

ఈసీ తరఫు అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ అవినాశ్​దేశాయ్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ, ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌కు ముందు ఈ విధంగా కొత్త ఓటర్ల నమోదు జరగడం సర్వసాధారణమని చెప్పారు. ఈసీ రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారమే అధికారులు కొత్త ఓటర్ల నమోదు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 2018లో 2.14 లక్షల ఓట్లు ఉన్న మునుగోడులో 2019లో  2.28 లక్షలు, 2020లో 2.30 లక్షలు, 2021లో 2.26 లక్షలు, ప్రస్తుతం 2.27 లక్షలుఉన్నారని ఉన్నట్లు లెక్కలు చెప్పారు. 25 వేల అప్లికేషన్లల్లో ఏడు వేలను ఆఫీసర్లు తిరస్కరించారని చెప్పారు. మొత్తం అప్లికేషన్లలో 40 శాతం వరకు తిరస్కారానికి గురయ్యాయని తెలిపారు. ఈసీ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని, ఈసీ యాక్ట్‌‌‌‌‌‌‌‌లోని 23(3) సెక్షన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం నామినేషన్లు దాఖలు చేసే చిట్టచివరి రోజు వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఆస్కారం ఉంటుందన్నారు.ఈ రూల్‌‌‌‌‌‌‌‌ ప్రకారం మునుగోడులో శుక్రవారం అంటే ఈ నెల 14వ తేదీ వరకు ఓటర్ల నమోదుకు అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. ఆ రూల్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ఉన్న రిట్‌‌‌‌‌‌‌‌ను కొట్టేయాలని కోరారు. ఈసీ వాదనల నిమిత్తం విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.