యాదాద్రి, వెలుగు : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 9వ రోజుకు చేరుకుంది. గురువారం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురంలో యాత్ర ప్రారంభం కాగానే స్వాతంత్ర్య సమరయోధుడు మొగులయ్యగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బండి సంజయ్‌ని కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రామన్నపేటకు చేరుకున్న బండి సంజయ్ దీక్ష చేస్తున్న వీఆర్‌ఏలతో మాట్లాడి వారికి మద్దతు ప్రకటించారు. అనంతరం పట్టణంలో పండ్ల వ్యాపారులు, ఇస్త్రీ షాపు నడుపుతున్న వృద్ధ దంపతులతో పలువురిని పలకరిస్తూ ముందుకు నడిచారు. ఈ సందర్భంగా చిన్నారులు, ఓ ముస్లిం మహిళ బండి సంజయ్‌కి రాఖీ కట్టారు. అనంతరం గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కాసోజు నాగరాజు ఆధ్వర్యంలో పలువురు బిల్ కలెక్టర్లు, కారోబార్లు సంజయ్‌ని కలిశారు.
30 ఏళ్లుగా పనిచేస్తున్నా తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వారిని సమరయోధులుగా గుర్తించి పింఛన్ ఇప్పించేలా, ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేలా సర్కార్‌పై ఒత్తిడి తేవాలని పలువురు కోరారు. అనంతరం దుబ్బాకలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. అక్కడి నుంచి మునిపంపులకు చేరుకొని రచ్చబండ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, నాయకులు పడమటి జగన్మోహన్‌రెడ్డి, దాసరి మల్లేశం పాల్గొన్నారు.