యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా : గూడూరు నారాయణ రెడ్డి

యాదాద్రి, వెలుగు:  తాను గెలిస్తే యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని బీజేపీ భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి  హామీ ఇచ్చారు. సోమవారం నియోజకవర్గంలోని భూదాన్​ పోచంపల్లి కప్రాయిపల్లి, జూలూరు,పెద్దగూడెం, జగత్పల్లితో పాటు భువనగిరిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఏ పదవీ లేకున్నా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న స్టూడెంట్స్​కు కోచింగ్​సెంటర్లు ఏర్పాటు చేయించానని గుర్తు చేశారు. 

కోచింగ్​ తీసుకున్న వారిలో 79 మందికి పోలీస్​ శాఖలో ఉద్యోగాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. తాను గెలిచిన వెంటనే భువనగిరిలో ఐటీ హబ్​ ఏర్పాటు చేయించి, 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని మాటిచ్చారు.  ఎమ్మెల్యే పైళ్లను రెండు సార్లు గెలిపించినా.. భువనగిరిలో కనీసం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.  తాను గెలిచిన వెంటనే సొంత ఖర్చుతో డిగ్రీ కాలేజీ కట్టిస్తానని ప్రకటించారు. మూసీ కాలుష్యం కారణంగా నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఎస్సీ వర్గీకరణ చేస్తాం

ఎస్సీ వర్గీకరణ  కోసం ప్రధాని మోదీ కట్టుబడిఉన్నారని భువనగిరి బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేస్తానని ప్రధాని చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దశాబ్దాలుగా ఎస్సీలు పోరాటం చేస్తున్నా కాంగ్రెస్​ పట్టించుకోలేదని, బీఆర్​ఎస్​ తెలంగాణలో ఎస్సీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు వర్గీకరణకు ప్రధాని మోదీ అండగా నిలబడ్డారని, ఎస్సీలు బీజేపీ అండగా నిలవాలని కోరారు.