జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో బీజేపీ ఎన్నికల కసరత్తు షూరు చేసింది. జమ్మూ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాషాయ పార్టీ.. ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ (సోమవారం) 44 మంది పేర్లతో ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. అయితే, ఈ జాబితాను విడుదల చేసిన నిమిషాల్లోనే బీజేపీ యూ టర్న్ తీసుకుంది. 44 మంది అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ బీజేపీ కీలక నేతల పేర్లు ఈ లిస్ట్ లో ప్రకటిచండకపోవడంతో పాటు ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు పెద్ద పీట వేడయంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతోనే తొలి జాబితా విషయంలో బీజేపీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ లిస్ట్ ను క్యాన్సిల్ చేసిన కాసేపటికే బీజేపీ మరో జాబితాను ప్రకటించింది. ఇందులో 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. మొదట ప్రకటించిన లిస్ట్ ను క్యాన్సిల్ చేయడం.. నిమిషాల వ్యవధిలోనే మరో జాబితాను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక, జమ్మూ కాశ్మీర్ లోని 90 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం మూడు దశల్లో జమ్మూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.