- ఆప్‌కు పరాభవం.. కేజ్రీవాల్ సహా కీలక నేతలు ఔట్
- మూడోసారి ఖాతా తెరువని కాంగ్రెస్.. సున్నాతో సరి
- ఈజీగా మేజిక్ ఫిగర్ దాటేసిన కమలనాథులు
- ఆప్‌ను దెబ్బకొట్టిన స్కామ్‌లు, కేసులు
- లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కేజ్రీవాల్, సిసోడియా, జైన్ ఓటమి
- ఆప్ చీఫ్‌ను సాగనంపిన పర్వేశ్ వర్మ.. గట్టెక్కిన ఆతిశి
- బరిలో నిలిచిన మరో 11 పార్టీలకూ జీరో
- ఓటుషేరింగ్లో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ
- బీజేపీకి 45.56%, ఆప్‌కు 43.57%, కాంగ్రెస్‌కు 6.34% ఓట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేసింది. 26 ఏండ్ల తర్వాత హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ భేరి మోగించింది. అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలనుకున్న ఆప్ ఆశలకు ఓటర్లు చెక్‌పెట్టారు. కేజ్రీవాల్‌సహా ఆ పార్టీ కీలక నేతలు ఓటమి మూటగట్టుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 70 సీట్లకు గానూ 48 సీట్లతో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది.
36 సీట్ల మ్యాజిక్‌ఫిగర్‌ను సునాయాసంగా దాటేసింది. ఫలితాల విడుదల మొదలైనప్పటి నుంచీ కమలం పార్టీ హవా కొనసాగగా.. ఆప్ చతికిలపడింది. 2020 ఎన్నికల్లో 62 సీట్లు సాధించిన కేజ్రీవాల్పార్టీ ఈ సారి 22 సీట్లకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్‌పార్టీ వరుసగా మూడోసారి ఖాతా తెరవలేదు. ఏ ఒక్కస్థానంలో ఆ పార్టీ అభ్యర్థులు గెలవలేదు. మరో 11 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచినా.. ఒక్క సీటు కూడా సాధించలేకపోయాయి.
ఓట్షేర్లో బీజేపీ–ఆప్ మధ్య హోరాహోరీ
ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో సాధారణ ఎన్నికలు జరిగాయి. మూడు రోజుల తర్వాత శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో ఆదినుంచీ అధికార ఆప్, బీజేపీ మధ్యే తీవ్ర పోటీ నెలకొన్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోపాటు సాధారణ బ్యాలెట్ఫలితాల్లోనూ ఆప్ కీలక నేతలు వెనుకబడగా.. బీజేపీ నేతలు దూసుకుపోయారు. ఓట్ షేరింగ్‌లోనూ బీజేపీ, ఆప్మధ్యే హోరాహోరీ పరిస్థితి కనిపించింది.
బీజేపీకి 45.56 శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57శాతం వరకు ఓటింగ్ నమోదైంది. ఆప్, బీజేపీ మధ్య 2 శాతం మాత్రమే ఓట్ షేర్‌లో తేడా ఉంది. ఇక కాంగ్రెస్ 6.34 శాతం ఓట్ షేర్ సాధించుకుంది. బరిలో నిలిచిన మరో 11 పార్టీల్లో జేడీ(యూ) మినహా ఏ పార్టీ ఒక శాతం కూడా ఓట్షేర్సాధించలేకపోయింది. జేడీ (యూ) 1.06 శాతం ఓట్లు సాధించి.. ఓట్షేరింగ్లో నాలుగో స్థానంలో నిలిచింది.
కేజ్రీవాల్ సహా ప్రముఖుల ఓటమి
ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగడంతో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌సహా కీలక నేతలకు ఓటమి తప్పలేదు. కేజ్రీవాల్ లక్ష్యంగానే బీజేపీ పావులు కదిపింది. ఎన్నికల ప్రచారం కూడా ఆయన చుట్టే కొనసాగింది. దీంతో న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్4 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. పర్వేశ్‌కు 30,088 ఓట్లు రాగా.. కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు పడ్డాయి. జంగ్‌పురలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓటమి చవిచూశారు.
బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ మార్వా చేతిలో 675 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఆప్‌కు చెందిన మరో సీనియర్ నేత సత్యేందర్ జైన్..షాకుర్బస్తీలో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్చేతిలో 20,998 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఆప్ కీలక నేత సౌరభ్భరద్వాజ్గ్రేటర్ కైలాశ్స్థానంలో ఓటమి చెందారు. బీజేపీకి చెందిన శిఖారాయ్చేతిలో 3,188 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆప్‌లో మరో కీలక నేత అయిన దుర్గేశ్‌పాఠక్.. రాజేంద్ర నగర్స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉమాంగ్బజాజ్ చేతిలో ఓటమి చవిచూశారు.
కేవలం 1,231 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాగా, కల్కాజీ స్థానం నుంచి ఢిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు. ఈమె తన బీజేపీ ప్రత్యర్థి రమేశ్బిధూరిపై 3,521 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొదటి నుంచి వెనుకంజలో ఉన్న ఆతిశి.. చివరి రౌండ్‌లో అనూహ్యంగా పుంజుకొని, విజయం దక్కించుకున్నారు. ఆప్‌కు చెందిన ముగ్గురు మంత్రులు -గోపాల్ రాయ్, ముఖేశ్అహ్లావత్, ఇమ్రాన్ హుస్సేన్ విజయం కీలక నేతల పరాజయం మధ్య ఆప్‌కు కాస్త ఊరట కల్పించింది.
బీజేపీ నేతల సంబురాలు
ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా బీజేపీ హెడ్ ఆఫీస్ వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురా లు నిర్వహించారు. చేతిలో పార్టీ జెండాలతో, డోలు వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ పండుగ వాతావరణం సృష్టించారు. కాషాయ రంగు పూసుకుని హోలీ ఆడారు. సంబురాల్లో వందలాది మంది పార్టీ మద్దతుదారులు పాల్గొన్నారు. ఓ అభిమాని 'పీకే' సినిమాలోని అమీర్ ఖాన్ గెటప్ వేసుకుని పార్టీ ఆఫీసుకు వచ్చాడు. చేతిలో పెద్ద లడ్డూ పట్టుకుని దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో పెట్టాడు. మరో చేతిలో రేడియో పట్టుకుని 'జాడూ నహీ రహా హమారే బీచ్ మే, కమల్ ఖిల్ గయా (చీపురు పోయింది.. కమలం వికసించింది)" కామెంట్ చేశాడు.
ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం
ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం. ఓటమిని అంగీకరిస్తున్నాం. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాం. బీజేపీకి అభినందనలు. ఎన్నికల హామీలన్నింటినీ ఆ పార్టీ నెరవేరుస్తుందని భావిస్తున్నాం. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్నికల్లో ఓడినా ప్రజల్లోనే ఉంటాను. వారి కష్టసుఖాల్లో తోడుంటాను. రాబోయే ఐదేండ్లు ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.
- అర్వింద్ కేజ్రీవాల్, ఆప్ కన్వీనర్
ప్రజల కోసం పోరాడుతాం
ఢిల్లీ పురోగతి, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం. కాలుష్యం, ధరల పెరుగుదల, అవినీతిపై నిలదీస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం.
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
అవినీతి, అబద్ధాల పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. వికాస్, విజన్, విశ్వాస్ సాధించిన విజయమిది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆప్.. అదే అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీలో జరిగిన ఆరు ఎన్నికల్లో (లోక్‌సభ, అసెంబ్లీ కలిపి) కాంగ్రెస్ ఖాతా తెరువలేకపోయింది.
- ప్రధాని మోదీ