కేసీఆర్ ను కాపాడేందుకే సీబీఐ దర్యాప్తు కోసం బీజేపీ డిమాండ్ : జీవన్​రెడ్డి

రాయికల్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్  నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని, ఆ  ప్రాజెక్టు పేరిట జరిగిన అవినీతిపై విచారణ చేపడుతామని కరీంనగర్ ​ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్​ రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను కాపాడేందుకే సీబీఐ దర్యాప్తు కోరాలని తమ ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్  చేస్తోందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని నాలుగేళ్లుగా బీజేపీ నాయకులు చెబుతున్నారని, మరి కేసీఆర్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా రాయికల్​ పట్టణంలోని నాలుగో వార్డులో శనివారం నిర్వహించిన ప్రజాపాలనలో ఆయన పాల్గొని దరఖాస్తులను పరిశీలించారు.

అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం వచ్చే బడ్జెట్ లో ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అర్హత ఉండి కూడా పెన్షన్  పొందలేనివారు దాదాపు 25 శాతం మంది ఉన్నారని, 2014 తర్వాత బీడీ కార్మికులకు కూడా గత ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రతి సంక్షేమ పథకం ఆధారమైన రేషన్​ కార్డుల జారీ ప్రక్రియను కేసీఆర్  కనుమరుగు చేశారని ఫైర్  అయ్యారు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్  నాయకులు ఆసరా పెన్షన్  రూ.2016 ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత ఆ హామీని నిలబెట్టుకున్నారని, కానీ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే పెన్షన్  ఎప్పుడు ఇస్తారంటూ వారు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి  సీఎంగా ప్రమాణం చేసిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు.