కాంగ్రెస్‌‌ సర్కార్‌‌ అవినీతిలో కూరుకుపోయింది :బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌‌

కాంగ్రెస్‌‌ సర్కార్‌‌ అవినీతిలో కూరుకుపోయింది :బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌‌
  • రేవంత్‌‌ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నరు

సిద్దిపేట టౌన్‌‌, వెలుగు : ‘కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అవినితిలో కూరుకుపోయింది, రేవంత్‌‌ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు’ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌‌ కె.లక్ష్మణ్‌‌ అన్నారు. శనివారం సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తే, ప్రస్తుత కాంగ్రెస్‌‌ ప్రభుత్వం మరింత కిందికి చేరుస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వంలో 3 నుంచి 4 శాతం కమిషన్‌‌ తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 నుంచి 12 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో తెచ్చి ఉద్యోగులు, భార్యాభర్తల ఉసురు పోసుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల టైంలో రాహుల్‌‌గాంధీ అశోక్‌‌నగర్‌‌లో చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక జాబ్‌‌ క్యాలెండర్‌‌కు బదులు సీఎం రేవంత్‌‌ పొలిటికల్‌‌ క్యాలెండర్‌‌ వేశారన్నారు. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసి గొప్పోన్ని అనిపించుకోవాలనుకోవడం సీఎం రేవంత్‌‌రెడ్డి అవివేకమన్నారు.

రాహుల్‌‌గాంధీ అధికారం కోల్పోయి తిరుగుతున్న మాదిరిగానే.. సీఎం రేవంత్‌‌రెడ్డి సైతం తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రధాని మోదీది అభివృద్ధి మంత్రం అని, బీసీల్లో ముస్లింలను కలపడం రాజ్యాంగానికి విరుద్ధం అన్నారు. బీజేపీ క్యాండిడేట్లను ఎమ్మెల్సీలుగా గెలిపిస్తే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉంటారని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్‌‌రెడ్డి, దూది శ్రీకాంత్‌‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నీలం దినేశ్‌‌, చింత సంతోష్‌‌ పాల్గొన్నారు.