పల్లెల్లో పట్టు కోసం కసరత్తు
సర్పంచులు,ఎంపీటీసీలే లక్ష్యంగా ప్లాన్
అనుబంధ మోర్చాలతో ప్రచారం షురూ
హైదరాబాద్, వెలుగు : పల్లెల్లో పట్టు కోసం బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్వరలోనే జరిగే లోకల్ బాడీ ఎన్నికలే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. దీనికోసం అనుబంధ మోర్చాలన్నింటినీ రంగంలోకి దింపింది. ఈసారి ఎక్కువ మొత్తంలో సర్పంచులు, ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో ఏడు నెలల కాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క గోషామహల్ నుంచి రాజా సింగ్ విజయం సాధించగా.. ఈసారి ఏకంగా 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో విజయం సాధించింది.
ఈ క్రమంలో అప్పటి వరకూ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్.. ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటి, అదే నిజం అని ప్రజల్లో విశ్వాసం కల్పించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల శంషాబాద్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ముందుకు పోవాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
స్థానిక సమస్యలపై నజర్
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 34 శాతం ఓట్లతో 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం ఆపార్టీలో ఉత్సాహం నింపింది. 46 అసెంబ్లీ స్థానాల్లో మొదటి స్థానంలో ఉండగా, మరో 44 స్థానాల్లో రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. ఉత్తర తెలంగాణలోని 3 పార్లమెంట్ స్థానాలతో పాటు మెదక్ ఎంపీ స్థానాన్ని గెలుచుకోవడం ఆపార్టీకి బలం చేకూర్చింది. దీంతో పల్లెల్లోనూ బీజేపీకి ఆదరణ మొదలైందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు.
బీజేపీ అనుబంధ రైతు, ఓబీసీ, మహిళ, గిరిజన, ఎస్సీ మోర్చాలను గ్రామాల బాట పట్టాలని ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టాలని కేడర్‌కు పిలుపునిచ్చింది. ఇవన్నీ చేస్తేనే త్వరలో జరిగే ఎన్నికల్లో సర్పంచు, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకునే ఛాన్స్ ఉంటుం దని పేర్కొంది. దీనికోసం ఇప్పటి నుంచే గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను తయారుచేసే పనిలో ఆపార్టీ నిమగ్నమైంది.