ఈ మార్పు దేనికి సంకేతం?

బీజేపీ ఎదుగుతున్న క్రమానికి దక్షిణాది రాష్ట్రాల్లో తరచూ పరీక్షలు ఎదురవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో  విస్తరిస్తున్నా, కర్నాటక ఓటమితోపాటు దక్షిణాదిలో బీజేపీకి ఆటుపోట్లు తప్పట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకడుగు ముందుకైతే రెండడుగులు వెనక్కి పడుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డిని తెలంగాణకు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మహిళా నేత పురందేశ్వరిని ఏపీకి అధ్యక్షులుగా తీసుకురావడం పార్టీకి బలమా? బరువా? అని తెలుగునాట చర్చకు తెరలేచింది.
‘తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా!’ అన్నది ‘అల్లూరి సీతారామ రాజు’ సినిమాలో పాపులర్‌‌ పాట. విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు రాశారు. అల్లూరి వంటి స్ఫూర్తిగొల్పే విప్లవ యోధుడిని ఇటీవల ఆయన జయంతి సందర్భంగా కుల చట్రంలో బంధించే ప్రయత్నాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఓ కార్యక్రమం ద్వారా పాలకపక్షాలు జరిపించ జూశాయి.

 బీజేపీ అధ్యక్ష మార్పుల ద్వారా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వం ఆశిస్తున్న మార్పు దిశలో పార్టీలోని తెలుగువీరులు లేస్తారా? దీక్ష బూనుతారా? అన్నది వేచి చూడాలి. ఎందుకంటే, కులం తోక పట్టుకొని గోదారి ఈది సురక్షితంగా రాజకీయ విజయతీరాలు చేరిన చరిత్ర చాలా అరుదు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ నాయకత్వానికి ఎదురవుతున్నవి పెను సవాళ్లే! కొత్త అధ్యక్షులు వాటిని ఎలా ఎదుర్కొని పార్టీని బలోపేతం చేస్తారు? ఏ మెరుగైన ఫలితాలు సాధిస్తారు? అన్నది ఇప్పుడొక కోటి రూకల ప్రశ్న!

నిందో నిజమో తేలాలి

తెలంగాణ, ఏపీలో కూడా పాలక పక్షాలకు దన్నుగా ఉంటోందన్నది బీజేపీ మీదున్న విమర్శ. కేంద్రంలోని బీజేపీ నేతృత్వపు ప్రభుత్వానికి కీలక సమయాల్లో ఇటు తెలంగాణ పాలకపక్షమైన బీఆర్‌‌ఎస్‌‌ అటు ఆంధ్ర పాలకపక్షమైన వైసీపీలు మద్దతిస్తూ సహకరిస్తున్నాయి. దానికితోడు, బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌‌ను ఈ రెండు రాష్ట్రాల్లో ఎదగనీయకుండా అవి కట్టడి చేస్తున్నాయి. ‘అది చాలులే తమకు’ అని బీజేపీ కేంద్ర నాయకత్వం సరిపెట్టుకుంటోంది అనేది వారిపైనున్న విమర్శ. రెండు చోట్లా ఇప్పుడు జరిగిన అధ్యక్ష మార్పులు అందుకు అనుగుణంగానే జరిగాయన్నది కాంగ్రెస్‌‌ వంటి ప్రత్యర్థి పార్టీల ఆరోపణ. ఈ నియామకాలతో తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్‌‌ దరి చేరకుండా కిషన్‌‌రెడ్డి, ఏపీలో కమ్మ సామాజిక వర్గం సంపూర్ణంగా చంద్రబాబు వెంట నడవకుండా పురందేశ్వరి ఏమైనా ఆపగలరా అన్నది ప్రశ్న. 

అది ‘నిజం కాదు నింద మాత్రమే!’ అంటే, దాన్ని నిరూపించాల్సిన సవాల్‌‌ కొత్త అధ్యక్షుల ముందున్నది. పార్టీలో ఉన్న స్పర్థలు, ముఠా తగాదాలు మాన్పి, ముఖ్యంగా తెలంగాణలో.. అందరినీ ఒక తాటిపైకి తేవాలి. ఏ లాలూచీ లేకుండా పాలకపక్షాలతో నిజంగానే పోరాడుతున్నాం, వారిని గద్దె దించడమే బీజేపీ లక్ష్యమని ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కల్పించాలి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటు షేర్‌‌ రమారమి పెంచి పెద్ద సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు గెలుచుకునేలా పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాలి. దిగిపోయిన అధ్యక్షులు బండి సంజయ్‌‌, సోము వీర్రాజు కన్నా ఏ విధంగా కొత్త నేతలు మెరుగో రుజువు చేయాలి. టీబీజేపీలో ఉండి ప్రయోజనం లేదని ఇతర పార్టీల వైపు కాలు కదుపుతున్న నేతలను కిషన్​ రెడ్డి ఆపగలరా? అన్నదీ సవాలే!

లాజిక్‌‌ మిస్సయింది

రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలనే ఒత్తిడి పెరిగిందనే కారణం తప్ప మార్పుల వెనుక సహేతుకత, కొత్తవారి ఎంపికలో లాజిక్‌‌ మిస్సయిందనే అభిప్రాయం బయటకన్నా బీజేపీలోనే ఎక్కువగా ఉంది. బండి సంజయ్‌‌ బాగా పనిచేస్తున్నారని పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్‌‌షాతోపాటు మోదీ కూడా ప్రశంసించిన సందర్భాలున్నాయి. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ కొంత క్రియాశీలమై దూసుకుపోయిన మాట వాస్తవం కూడా! 

పార్టీలో విభేదాలు, ముఠా తగాదాలు, అనైక్యత విషయానికి వస్తే, పార్టీ కేంద్ర నాయకత్వమే తొలి ముద్దాయిగా నిలవాల్సి వస్తుంది. దానికి రాష్ట్ర అధ్యక్షుడిని ఒంటరి బాధ్యుడ్ని చేయడం సరికాదు. నిజంగా సంజయ్‌‌ వల్ల తప్పిదం ఏదైనా జరిగి ఉంటే సరిదిద్ది, అయిదు నెలల్లో జరగాల్సిన ఎన్నికల వరకు కొనసాగించి ఉండాల్సిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. 

కిషన్​రెడ్డి ఎంపిక

కిషన్‌‌రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతూనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే అవకాశాలున్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘకాలం అధ్యక్ష హోదాలో ఉండి పలు ఎన్నికలు ఎదుర్కొని, చేదు ఫలితాలు చవి చూసిన కిషన్‌‌రెడ్డి ఎంపిక ప్రయోగం ఏం కాదు. కొత్త ప్రయోజనం ఏం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. 2004 నుంచి పార్టీ శాసనసభ పక్షనేతగా, 2010 నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2014లో ఆయన నేతృత్వంలోనే టీడీపీతో పొత్తులో కూడా బీజేపీ నెగ్గిన అయిదు సీట్లు నగరం, చుట్టు పక్కల అర్బన్‌‌లోనే! పార్టీ దక్షిణాది నుంచి ఎదిగే క్రమంలో బంగారు లక్ష్మణ్‌‌, జానా కృష్ణమూర్తి, వెంకయ్యనాయుడు తర్వాత అవకాశం లభిస్తే పార్టీ జాతీయ అధ్యక్షుడవుదామనుకున్న కిషన్‌‌ రెడ్డి తెలంగాణ పరీక్షకు రావాల్సి వచ్చింది. 

రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు బీసీలను మచ్చిక చేసుకోవాల్సిన సమయంలో ఒక బీసీ నాయకుడిని తప్పించి అగ్రకులానికి తిరిగి పట్టం కట్టడం హేతుబద్దంగా లేదనేది వాదన. ఇక ఏపీ విషయంలోనూ కాపులు గర్వంగా చెప్పుకునే వంగవీటి మోహనరంగా జయంతి రోజున, అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని తప్పించి మరో ‘పోటీ’ సామాజిక వర్గమైన ‘కమ్మ’కు కిరీటం పెట్టడంలో ‘లాజిక్‌‌’ ఏముందని పార్టీ వారే ప్రశ్నిస్తున్నారు. సదరు సామాజిక వర్గం వారు ఏ పార్టీలో ఉన్నా ‘తెలుగుదేశం’ ప్రయోజనాలే ఆశిస్తారనేది ప్రతీతి! ఇప్పుడా విమర్శను తట్టుకొని, దాన్ని తప్పని నిరూపించాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షులపై ఉంటుంది.

సంస్థాగతంగా బలపడితేనే..

సంస్థాగత కారణాల వల్లే రెండు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పిడికి అధినాయకత్వం తలపడ్డపుడు పార్టీని బలోపేతం చేయడం కొత్త అధ్యక్షుల ముందు ప్రధాన కర్తవ్యం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించి, ఈ విషయంలో కాకినాడలో ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అని ముందుగానే గొంతెత్తి కూడా ఆ సానుభూతి, సహకారాన్ని జనక్షేత్రం నుంచి బీజేపీ పొందలేక పోయింది. ఘోరంగా తల్లి నుంచి బిడ్డను వేరు చేసినట్టు రాష్ట్రం విడగొట్టారనే అర్థం వచ్చేలా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పార్టీని మరింత ఇరకాటంలో పడేశాయి. పార్టీ పేరులోంచి ‘తెలంగాణ’ను తీసేసిన బీఆర్‌‌ఎస్‌‌ను తెలంగాణ మనోభావాల పరంగా ఇరుకున పెట్టాల్సిన స్థితిలో బీజేపీ తానే ఒక సందిగ్ధ స్థితిలో ఉండటం సంస్థాగత ఎదుగుదలకు అవరోధమే! పార్టీలో కీలకమైన సంస్థాగత వ్యవహారాలు చూసే ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. 

పార్టీ శాసనసభ పక్ష నేత లేరు. రాజాసింగ్‌‌పై సస్పెన్షన్‌‌ వ్యవహారం ఇంకా గాల్లోనే ఉంది. అమిత్‌‌షా, నడ్డా, సంతోష్‌‌ వంటి కేంద్ర నాయకుల వైఫల్యాలు, బండి సంజయ్‌‌కు అన్ని కోట్లు ఎక్కడివి అని పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌‌ రావు చేసిన ఆరోపణలకు ఖండనో, సమాధానమో రాలేదు. పోనీ క్రమశిక్షణా చర్యలు లేవు. రోజురోజుకు ప్రజాక్షేత్రంలో పలుచన కాకుండా పార్టీని, దాని ప్రతిష్టను కొపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం పార్టీ నాయకత్వంపై ఉంది. ఇవన్నీ కొత్త రాష్ట్ర అధ్యక్షుల ముందు సవాళ్లే!

కులం బలమా? విఫలమా?

రాజకీయంగా పార్టీని విజయతీరాలు చేర్చే నావ కాగలుగుతుందా కులం? ఇదొక చిక్కు ప్రశ్న! కానీ, ఆ కోణంలో ఆలోచించకుండా రాజకీయాలు నడపలేని పరిస్థితులు దేశంలో, ముఖ్యంగా ఏపీలో నెలకొని ఉన్నాయి. దేన్నైనా జనం కులం చట్రంలో నుంచి చూస్తారనే ప్రచారం బలంగా ఉంది. అందుకే కులాల పరంగా బహుళ సంఖ్యాకుల కన్నా కూడా ఆదిపత్య కులాలు వైపే రాజకీయ పక్షాలు మొగ్గుతుంటాయి. బీజేపీ ప్రస్తుత ఎంపిక కూడా రెండు రాష్ట్రాల్లోనూ ఆధిపత్య కులాలైన రెడ్డి, కమ్మల వైపు నాయకత్వం తలొగ్గింది. కానీ, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. ఇక్కడ ‘రెడ్డి’ సామాజిక వర్గం కాంగ్రెస్‌‌కు, ఏపీలో ‘కమ్మ’ సామాజిక వర్గం టీడీపీకి దన్నుగా నిలుస్తాయన్నది 

రాజ కీయ పరిశీలకుల భావన! 2019లో తెలంగాణలో బీజేపీ 4 లోక్‌‌సభ స్థానాలు గెలవగా వాటిలో.. ఒకటి రెడ్డి, మరొకటి ఎస్టీ కాగా మిగిలిన రెండూ బీసీల నుంచే. ఆ ఎన్నికల్లోనూ అగ్రకులాలు, ముఖ్యంగా రెడ్డిలు పాలక పక్షంతోనే ఉన్నట్టు ‘సీఎన్‌‌డీఎస్‌‌’ సర్వే తేల్చింది. నిజానికి వ్యూహాత్మకంగా అయితే బీజేపీ ఇప్పుడు బీసీలను మచ్చిక చేసుకోవడమే సరైన పంథా కాగలుగు తుంది. 7 శాతం నుంచి 12, 13 శాతానికి ఎదిగినట్టు అధ్యయనాలున్నాయి. బహుజన సామాజిక వర్గాలను లక్ష్యం చేసుకుంటేనే పార్టీ గ్రాఫ్‌‌ ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దిశలో నాయకత్వం విఫలమౌతోంది.

- దిలీప్‌‌ రెడ్డి,
పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, 
పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ,