ముచ్చటగా మూడోసారి: హర్యానాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ

ముచ్చటగా మూడోసారి: హర్యానాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ

చండీఘర్: హర్యానాలో ముచ్చటగా మూడోసారి బీజేపీ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎవరు ఊహించని విధంగా కాషాయ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగానూ 48 సీట్లలో విజయ ఢంకా మోగించి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 46 సీట్ల మార్క్‎ను క్రాస్ చేసింది. తద్వారా మరోసారి హర్యానా గడ్డపై  బీజేపీ జెండా రెపరెపలాడనుంది. కాగా, ఎన్నికల కౌంటింగ్ మొదట్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా బీజేపీ వెనుకంజలో ఉండగా.. కాంగ్రెస్ భారీ అధిక్యం సాధించింది. 

దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు కాంగ్రెస్ పార్టీ హర్యానాలో విజయం సాధించడం ఖాయమని అంతా ఫిక్స్ అయారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద హస్తం పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చుతూ, సీట్లు పంపుకుంటూ ఏకంగా సంబురాలు చేసుకున్నారు. కానీ ఆ ఆనందం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో సేపు నిలువలేదు. మూడు, నాలుగు రౌండ్ల కౌంటింగ్ నుండి బీజేపీ తన సత్తా చాటింది. వరుస రౌండ్లలో అధిక్యం సాధిస్తూ జెడ్ స్పీడ్‎లో లీడింగ్‎‎లోకి దూసుకొచ్చింది. 

అప్పటి వరకు మొదటి స్థానంలో కొనసాగిన కాంగ్రెస్ బీజేపీ దెబ్బకు రెండో స్థానానికి పరిమితం అయ్యింది. అక్కడ నుండి ఇక కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీట్ చేయలేక సెకండ్ ప్లేస్‎లోనే నిలిచిపోయింది. 37 స్థానాలకే పరిమితమై మరోసారి అధికారానికి కాంగ్రెస్ దూరమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‎కు (46 స్థానాలు) 9 సీట్ల దూరంలో ఆగిపోయిన కాంగ్రెస్.. హర్యానాలో మరోసారి ప్రతిపక్షానికి పరిమితమైంది.

 ఇక, కాంగ్రెస్‎తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగిన ఆప్ ఘోర పరాజయం పాలైంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటమి పాలై.. కనీసం ఖాతా కూడా తెరవలేదు. లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో రెండు రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో జరగగా.. హర్యానాలో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ.. జమ్మూ కాశ్మీర్ లోనూ గతానికంటే మెరుగైన ఫలితాలు రాబట్టింది.