బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ తన మొత్తం ఆస్తులను ప్రకటించారు. తన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల పూర్తి వివరాలు పొందుపర్చారు. అఫిడవిట్ ప్రకారం.. కంగనాకు మొత్తం రూ.90 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో.. రూ.28.73 కోట్ల చర, రూ.62.92 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె చేతిలో రూ.2లక్షలు ఉండగా.. బ్యాంక్ ఖాతాల్లో దాదాపు రూ.1.35 కోట్లు ఉన్నాయి. ఆమె పేరిట రూ.17.38 కోట్ల అప్పు ఉంది. ఆమె దగ్గర 6 కిలోల బంగారు, 60 కిలోల వెండి, రూ.3 కోట్లు విలువచేసే వజ్రాభరణాలు ఉన్నాయి. రూ.3.91 కోట్లు విలువ చేసే మూడు లగ్జరీ కార్లు ఉన్నాయి. కంగనాపై 8 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
కాగా, కంగనా రనౌత్.. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మే14వ తేదీ మంగళవారం మండి లోక్ సభ నియోజకవర్గంలో ఆమె నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో లో మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కంగనా వెంట ఉన్నారు. మండి ప్రజల ప్రేమ వల్లే తాను ఇక్కడివరకు వచ్చానని.. సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నట్లే రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తానని కంగనా రనౌత్ చెప్పారు.
ఇక, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గానికి 7వ చివరి దశ పార్లమెంటు ఎన్నికలలో భాగంగా జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది.