
- ముస్లింల కోసం బీసీల హక్కులను కాలరాసే కుట్ర
- ఎంపీ లక్ష్మణ్ ఆరోపణ
నిజామాబాద్, వెలుగు : ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ఎజెండా అమలు చేస్తున్నారని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. మొదట్లో హైడ్రా పేరుతో తర్వాత మూసీ, రైతుభరోసా పేరుతో కాలం వెళ్లదీసి ఇప్పుడు కులాల మధ్య పంచాయితీ పెట్టారన్నారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్లు మల్క కొమురయ్య, అంజిరెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన ఆయన నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు బీసీ రిజర్వేషన్‌ను 45 శాతానికి తగ్గించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పేద ముస్లింల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లోన్లు ఇచ్చుకుంటే అభ్యంతరం లేదని కానీ మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే మాత్రం ఒప్పుకోబోమన్నారు. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపిస్తి రేవంత్‌రెడ్డికి ఊడిగం చేయడం తప్పితే ఆయన చేసేదేమీ ఉండదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా వేయలేదన్నారు.
రూ.8 వేల కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ఆపేసి 50 లక్షల మంది స్టూడెంట్ల ఉన్నత చదువులను అగాథంలోకి నెట్టేశారని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తెలిసీ ఓట్ల కోసం హామీ ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లను గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎంపీ అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, ఎమ్మెల్సీ క్యాండిడేట్లు మల్క కొమురయ్య, అంజిరెడ్డి పాల్గొన్నారు.