
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కారు క్రోనిజం (ఆశ్రిత పక్షపాతం), రెగ్యులేటరీ నిర్వహణ లోపంతో బ్యాంకింగ్ సెక్టార్ సంక్షోభంలో పడిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీంతో జూనియర్ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందని, వారు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీజేపీ సర్కారు తన బిలియనీర్ స్నేహితుల కోసం రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు.
కేంద్ర సర్కారు ఈ ఆర్థిక దుర్వినియోగం వల్ల వేలాది మంది నిజాయితీపరులైన నిపుణులపై ప్రభావం చూపిందన్నారు. చాలామంది ఉద్యోగులు నష్టపోయారని చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ప్రతినిధి బృందంతో తాను సమావేశమైన వీడియోను రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కేంద్ర సర్కారు తీరుతో నష్టపోయిన ఉద్యోగుల తరఫున కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. పని ప్రదేశంలో వేధింపులు అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు.
అన్యాయం జరిగితే సంప్రదించండి
782 మంది ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఉద్యోగుల తరఫున ఒక ప్రతినిధి బృందం తనను పార్లమెంట్లో కలిసిందని రాహుల్ గాంధీ తెలిపారు. వారు చెప్పిన విషయాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. బ్యాంకు ఆఫీసుల్లో వేధింపులు, బలవంతపు బదిలీలు, ఎన్పీఏ ఉల్లంఘించినవారికి అనైతికంగా ఇచ్చిన రుణాల వివరాలను బహిర్గతం చేసినందుకు ప్రతీకారం వంటివి తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ఇలాంటి వేధింపులతో ఇద్దరు సూసైడ్‌కు పాల్పడడం తనను బాధించిందని చెప్పారు. అన్యాయానికి గురైన ఉద్యోగులెవరైనా తనను ఎప్పుడైనా సంప్రదించొచ్చని తెలిపారు.