తెలంగాణలో బీజేపీ విజృంభిస్తది

విజృంభిస్తదిభారతీయ జనతా పార్టీ ఈ జనరల్‌‌ ఎలక్షన్స్‌‌లో దేశంలోనే పెద్ద వండర్‌‌ స్పష్టించింది.  తెలంగాణ విషయానికొస్తే… నాలుగు పార్లమెంటరీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇది కేవలం హిందూత్వ ఎజెండావల్ల దక్కిన విజయం కాదంటున్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌‌ మాధవ్‌‌. ప్రజలు తమ పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చూపించిన అభివృద్ధికి వేసిన ఓటుగా అభివర్ణిస్తున్నారు.  ఉత్తర తెలంగాణలోని అయిదు లోక్‌‌సభా స్థానాలకు ఆయన ఇన్‌‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. వాటిలో మూడు చోట్ల బీజేపీ జెండా రెపరెపలాడడంపై రామ్‌‌మాధవ్‌‌ ‘వెలుగు’ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే….

వెలుగు: నాలుగు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ, ఈ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను గెలవడాన్ని మీ జాతీయ నాయకత్వం ఊహించిందా?

రామ్‌‌మాధవ్‌‌ : మొత్తం నాలుగు సీట్లు గెలిచాం. మేము ఆనవాయితీగా సికిందరాబాద్‌‌ సీటును గెలుచుకుంటున్నాం. ఇవికాక, మెదక్‌‌, మహబూబ్‌‌నగర్‌‌, మల్కాజ్‌‌గిరి సీట్లలో రెండు లక్షలకు పైగా ఓట్లు సాధించి దక్షిణ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగాం. కొన్ని సీట్లు మేము గెలిచి తీరతాం అనే ఆత్మ విశ్వాసం మాలో మొదటినుంచీ ఉంది. ఎన్ని సీట్లు అనే స్పష్టత లేదు. మీడియాకి, రాజకీయ విశ్లేషకులకు మాత్రం నమ్మకం లేదు. సున్నా సీట్లు వస్తాయని చెబుతూ వచ్చారు.

టీఆర్‌‌ఎస్‌‌ని ఢీకొనే సత్తా బీజేపీకి ఉందా? మోడీని చూసి ఓటేశారు తప్ప, కిందిస్థాయిలో కేడర్‌‌ లేదనే మాట వినబడుతోంది.

రా: తెలంగాణలో మాది చాలా నేచురల్‌‌ పార్టీ. తెలంగాణకోసం మొదటి నుంచీ పోరాడిన పార్టీ. జాతీయ రాజకీయాలతో ప్రభావితమయ్యే ప్రాంతం ఇది. ఈ రోజున బీజేపీని తలదన్నే పార్టీ మరొకటి లేనేలేదు. ఇక్కడి సంస్కృతికి, ప్రజలకు, మనోభావాలకు అత్యంత సన్నిహితమైన పార్టీ బీజేపీయే.  తెలంగాణను మేమే సాధించామన్న మభ్యపూరిత ప్రచారంతో టీఆర్‌‌ఎస్‌‌ కొంత లాభం పొందినమాట వాస్తవమే. అతి తొందరలోనే పూర్తి శక్తి సామర్థ్యాలతో తెలంగాణలో బీజేపీ విజృంభించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నిరుత్సాహపూరిత ఫలితాలు సాధించాం. కానీ, పార్లమెంట్‌‌ ఎన్నికల్లో ఒకవైపున మోడీ నాయకత్వమూ, మరో వైపున సరైన అభ్యర్థుల ఎంపిక కారణంగా మేము మంచి ఫలితాల్ని సాధించగలిగాం. ఉత్తర తెలంగాణలో ప్రారంభమైన ఈ విజయపరంపర రాబోయే రోజుల్లో కొనసాగుతుంది.

నూట మూడు అసెంబ్లీ సీట్లలో డిపాజిట్‌‌ రాలేదు. ఈ నాలుగు నెలల్లో ఎందుకింత చేంజ్‌‌ వచ్చిందంటారు?

రా: దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి మోడీ  ప్రభావం, రెండోది కేసీఆర్‌‌ నిరంకుశ వైఖరి.  ఆయనకు రెండోసారి అధికారాన్ని అప్పగించిన తర్వాత ప్రవర్తించిన తీరు. రెండు నెలలపాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు. మంత్రివర్గం లేకుండా అంతా తానే అన్నట్టుగా నడిపించడం.  అహంకారం, దుండుదుకు, వాచాలత, హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ మతాలనే కించపరిచేలా మాట్లాడడం. ఇవన్నీ చూసిన తర్వాత ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టకపోతే ఈ రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌‌కి చెక్‌‌ పెట్టలేమనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఆ సమయంలో వాళ్లకు బీజేపీ ప్రత్యామ్నాయంగా కనిపించింది.

మీరు చెప్పిన మాట నిజమే. ఒక్క సీటు గెలుచుకుని నూట మూడు స్థానాల్లో డిపాజిట్‌‌ కోట్పోయిన పార్టీ ఈ రోజున 25 శాతం ఓట్లు సంపాదించుకుంది.

 కాంగ్రెస్‌‌ వాళ్లేమంటారంటే… బీజేపీ లక్కీగా నాలుగు స్థానాల్లో గెలిచింది. అది టీఆర్‌‌ఎస్‌‌ మీద వ్యతిరేకతతోనే….

రా: ఇది ఉల్టా అనుకోవాలి. ఈ రోజున కాంగ్రెస్‌‌ పార్టీ తెలంగాణలోనే కాదు, దేశం మొత్తం మీద లక్‌‌ ఆధారంగా గెలుస్తోంది.

క్యాడర్‌‌, లీడర్‌‌ పరంగా చూస్తే తెలంగాణలో రెండో స్థానం కాంగ్రెస్‌‌కే ఉంది. వాళ్లను మీరు ఎట్లా అధిగమించగలరు?

రా: చాలా తొందరలో కాంగ్రెస్‌‌లో ఉన్నటువంటి మంచినాయకులు మోడీ ప్రగతిశీల విధానాలపట్ల ఆకర్షితులై దేశ భవిష్యత్తును దృష్ఠిలో పెట్టుకుని మావైపు రాబోతున్నారు.  దేశంలోనూ, తెలంగాణలోనూ కూడా అన్ని పార్టీలలోనూ ఉన్న మంచినాయకులను, దేశంకోసం ఆలోచించేవారిని మాతో కలుపుకుని ముందుకు వెళ్లబోతున్నాం.  అతి తొందరలోనే ఈ రాష్ట్రంలో మేము కాంగ్రెస్‌‌ని దాటి, టీఆర్‌‌ఎస్‌‌కి ప్రత్యామ్నాయంగా ముందుకు వెళ్తాం.

ఈ అయిదేళ్లలోనూ వినిపించిన మాట ఏమిటంటే… మీ ఇద్దరి మధ్య మ్యాచ్‌‌ ఫిక్సింగ్‌‌ జరిగింది. నోట్ల రద్దులోనూ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌‌ ఎన్నికల్లోనూ మీకు సపోర్టు చేశారని; అందువల్లనే జాతీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదని. అదే మళ్లీ రిపీట్‌‌ కాదని గ్యారంటీ ఏమిటి?

రా: ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌, ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. మేము కంటిన్యూస్‌‌గా చెబుతున్నదేమిటి? మేము ఈ రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌‌కి ప్రత్యామ్నాయంగా వస్తున్నాం అని పదే పదే చెబుతూ వచ్చాం.

తెలంగాణలో ప్రధానిగానీ, అమిత్‌‌ షాగానీ ప్రచారం చేయలేదు.

రా: అదేం లేదు. ప్రధాని రెండుసార్లు ఇక్కడికి వచ్చారు. అమిత్‌‌ షా నాలుగుసార్లు ప్రచారానికి వచ్చారు. అమిత్‌‌ షా నిజామాబాద్‌‌లోనూ, ప్రధానమంత్రి కరీంనగర్‌‌లోనూ ర్యాలీలో పాల్గొన్నారు.

లేదు లేదు. ప్రధాని ర్యాలీ చేయలేదు. అమిత్‌‌ షాది కరీంనగర్‌‌లో ఉండేది ,క్యాన్సిల్‌‌ అయ్యింది.

రా: తెలంగాణలో మేము మంచి ప్రచారం చేయడంవల్ల ఈ సీట్లు గెలుచుకోగలిగాం.

మీరు జమ్మూ కాశ్మీర్‌‌లో, నార్త్‌‌ ఈస్ట్‌‌లో ఇన్‌‌చార్జిగా పనిచేసి, ఎంతొమంది కొత్తవాళ్లను పార్టీలోకి తీసుకురాగలిగారు. కానీ, ఇక్కడ ఉన్న విమర్శే మిటంటే… ఇక్కడున్న నాయకులు కొత్తవాళ్లను పార్టీలో ఎదగనివ్వరని, వాళ్లను ఎటూ మసలకుండా చేస్తారని అంటారు. కొత్తవాళ్లను తేవడం ఇక్కడ సాధ్యమేనా మరి?

రా: మా పార్టీ తరఫున నెగ్గిన నలుగురు ఎంపీల్లో ఇద్దరు కొత్తవాళ్లు. నిజామాబాద్‌‌,ఆదిలాబాద్‌‌ నుంచి గెలిచిన ఇద్దరూ కొంతకాలం క్రితమే పార్టీలో చేరారు.

వాళ్లకు మీ అండదండలున్నాయంటారు.

రా: అవును. అదే కదా! మేము కొత్త పాత అనే విచక్షణ లేకుండాప్రజల్లో పలుకుబడి, మంచిపేరు ఉండి, ప్రజా హితం, రాష్ట్రహితం ఉండి, మోడీ విధానాలతో ఏకీభవించేవాళ్లందరినీ స్వాగతిస్తాం. వాళ్లకు పెద్ద పీట వేస్తాం. మహబూబ్‌‌నగర్‌‌లో మేము నిలబెట్టిన అరుణమ్మ ఎప్పుడు వచ్చారండి? ఎలక్షన్‌‌కి కొద్ది రోజుల ముందు వచ్చారు. ఆమెను క్యాండిడేట్‌‌గా నిలబెట్టినాం. ఆ విధంగా మంచివారు, యోగ్యులు అయినవారిని మా పార్టీలో చేర్చుకుని మంచి గౌరవమిచ్చి ముందుకు తీసుకెళ్తాం.

‘బీజేపీ అంటే హైదరాబాద్‌‌ బేస్‌‌డ్‌‌ పార్టీ. రాష్ట్ర అధ్యక్షుడైనా, ఎల్‌‌పీ లీడరైనా ఇక్కడి నుంచే ఉంటారు. ఇది దాటి రూరల్‌‌కి వెళ్లరు’ అన్న విమర్శ ఉంది.

రాష్ట్రంలో హైదరాబాదుకొక ప్రత్యేక స్థానముంది. ఏ ఊరి నుంచి ఏ నాయకుడొచ్చినా వారికి హైదరాబాదులో ఇల్లుంటుంది.  కాబట్టి, ఎవరైనా అందరూ హైదరాబాద్‌‌ వారే.

బీజేపీఈసారి అతి పెద్ద విజయాల్ని సాధించినదంతా నార్త్‌‌ తెలంగాణలోనే. అక్కడి నుంచి అనేకమంది నాయకులు మా స్టేట్‌‌ టీమ్‌‌లో ఉన్నారు. బండి సంజయ్‌‌ స్టేట్‌‌ జనరల్‌‌ సెక్రటరీగా ఉన్నారు.

ముఖ్య పదవులేవీ బయటవాళ్లకు దక్కడం లేదు అని….

రా: ఇవన్నీ ముఖ్య పదవులే. మేము అన్ని ప్రాంతాలకు, వర్గాలకు పార్టీలో ప్రాతినిధ్యం కల్పించడం జరుగుతోంది. ప్రజాదరణ ఉండి, ప్రజల్లో పలుకుబడి, మంచి చరిత్ర ఉండి రాష్ట్ర హితమూ దేశహితమూ మోడీ విధానాలపట్ల ఆసక్తి ఉన్నవాళ్లను మా పార్టీ ద్వారాలను తెరచి స్వాగతిస్తాం. మంచి గౌరవమిస్తాం.

క్రిస్టియన్లు, ముస్లింలు ఎక్కువ ఉండే జమ్మూ కాశ్మీర్‌‌, నార్త్‌‌ ఈస్ట్‌‌లో కూడా పవర్​లోకి రాగలిగింది బీజేపీ. సౌతిండియాలో ఈ ఎలక్షన్‌‌లోకూడా కేరళ., తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌, దాని మిత్రపక్షాలు డ్యామినేట్‌‌చేశాయి. ఆంధ్రప్రదేశ్‌‌లో మీకు జీరో. ఒక్క తెలంగాణ, కర్ణాటక మాత్రమే పర్వాలేదనిపించారు. సౌతిండియాలో మీ ఫ్యూచర్‌‌ ప్లాన్లు ఏంటి?.

రా: ఈశాన్య రాష్ట్రాల్లో, జమ్మూకాశ్మీర్‌‌లో బీజేపీని ఒక బలమైన శక్తిగానిలబెట్టడంలో గత అయిదు సంవత్సరాల్లో మేము ఘన విజయాన్ని సాధించాం. నార్త్‌‌ ఈస్ట్‌‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ లేదా దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్‌‌ పూర్తిగా ముక్త ఈశాన్యం అయిపోయింది. సౌతిండియాలో దృష్ఠి పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కొంత విజయాలొచ్చేశాయి. కర్ణాటక ట్రెడిషన్‌‌లుగా బీజేపీ బలంగా ఉంది. కేరళ, తమిళనాడు, ఆంధప్రదేశ్​లపై రానున్న రోజుల్లో మరింత దృష్టి పెట్టాల్సిన విషయాన్ని ఇప్పటికే గుర్తించాం. భవిష్యత్​లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీని బలమైన శక్తిగా నిలబెడతాం .

గడచిన ఐదేళ్లలో మోడీ,​ అమిత్​ షా తెలంగాణ, ఏపీల్లో పర్యటించించింది చాలా తక్కువ. ఈసారీ అలాగే ఉంటుందా? లేక ఎక్కువ ఫోకస్​​ పెడతారా?

రా: గత ఐదేళ్లలో మా దృష్టి ఎక్కువగా ఈస్టర్న్​ ఇండియా, నార్త్‌‌ ఈస్ట్​పైనే ఉంది. వచ్చే ఐదేళ్లు మాత్రం సౌతిండియాకి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ పార్టీని బలోపేతం చేయటానికి ఇప్పటికే వ్యూహాలను తయారు చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రధాని మోడీ తప్పనిసరిగా ఇక్కడ పర్యటిస్తారు. పార్టీకి కొత్త ప్రెసిడెంట్​ రావొచ్చు. ఆయన చూపు కూడా ఇటు వైపే ఉంటుంది.

పోయిన ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు విషయంలో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు తలో రకంగా మాట్లాడేవాళ్లు. ఒక వైపు మినిస్టర్లు పొగిడితే మరో వైపు లీడర్లు విమర్శించేవాళ్లు. ఇది తమకు ఇబ్బందికరంగా ఉందని ఇక్కడి లీడర్లు అప్పట్లో ఫిర్యాదు చేసేవారు. .

రా: గవర్నమెంట్​ ప్రొటోకాల్స్​ వేరు. పొలిటికల్​ పార్టీ పాలసీలు వేరు. రెండిటినీ కలిపి చూడొద్దు. రాష్ట్ర ప్రభుత్వపరంగా మంచి పనులేవైనా ఉంటే గెస్టుల్లా వచ్చే కేంద్ర మంత్రులు నాలుగు మంచి మాటలు చెప్పటంలో తప్పు లేదు. దాన్ని పార్టీ పాలసీలో భాగంగా పరిగణించొద్దు. అందువల్ల పార్టీ పరంగా టీఆర్​ఎస్​ చేసే తప్పుడు రాజకీయాలను ఎండగడతాం.

తాజా లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏకి అఖండమైన మెజారిటీ లభించింది. అందువల్ల మీ కోర్​ ఐడియాలజీలోని ఆర్టికల్​–370, రామ మందిరం వంటివి ఈ టర్మ్​లో చేపట్టే అవకాశం ఉందా?

రా: మా కోర్​ ఐడియాలజీలో ఈ రెండు మాత్రమే కాక అభివృద్ధి, జాతీయ సమైక్యత,​ ఆర్థిక పురోగతి, ఇండియాను బలమైన సెక్యూరిటీ గల దేశంగా నిలబెట్టాలనే అంశాలు ఉన్నాయి. వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఐదేళ్లూ పనిచేస్తాం.

లాస్ట్‌‌ టైమ్‌‌కూడా మీకు క్లియర్​ మెజారిటీయే ఉంది. కానీ అప్పుడెందుకు ఆర్టికల్​–370ని రద్దు చేయలేదు?

రా: ఆర్టికల్​–370 రద్దు ఒక పార్లమెంటరీ ప్రక్రియ. ఈ దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టాం.

 జమ్మూకాశ్మీర్​, నార్త్‌‌ ఈస్ట్‌‌​ రెండు చోట్లా ప్రజలు మీకు స్పష్టమైన తీర్పిచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్​–370 రద్దు, దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలుకే అమిత్​ షాని హోం మినిస్టర్​గా నియమించారనుకోవచ్చా?

రా: ఎన్​ఆర్​సీ ఒక స్పెషల్​ యాక్ట్​ ద్వారా అమలవుతున్న విషయం. దాన్ని ఆ చట్టం అస్సాంకే పరిమితం చేసింది. కాబట్టి ఆ ప్రక్రియ ఆ రాష్ట్రంలో పూర్తవుతుంది. దేశవ్యాప్తంగా అక్రమంగా ప్రవేశించినవారు ఎక్కడున్నా వాళ్లను గుర్తించి బయటకు పంపించే కార్యక్రమాన్ని హోం మినిస్ట్రీ ఇప్పటికే చేపట్టింది. అమిత్​షా నాయకత్వంలో ఆ ప్రక్రియ ముందుకెళుతుంది.

అవుటాఫ్‌‌ కోర్టు సెటిల్‌‌మెంట్‌‌కి మీరు వ్యతిరేకం అన్నారు కదా!

రా: ఏ సెటిల్‌‌మెంట్‌‌కీ ఏ వ్యవస్థకూ మా జోక్యం ఏమీ లేదు. ఆ విషయం సంబంధిత పార్టీలకు నచ్చాలి. రామ జన్మభూమి న్యాస్‌‌ ఒప్పుకోవాలి. ఎందుకంటే, రామ మందిర నిర్మాణ బాధ్యత వారిది. అక్కడ భవ్యమైన రామమందిర నిర్మాణానికి  అవసరమైన సహాయసహకారాలు కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు రెండుకూడా అందిస్తాయి.

అన్‌‌ఎంప్లాయిమెంట్‌‌ గత యాభై ఏళ్ల రికార్డుని దాటిపోయిందని రీసెంట్‌‌గా కేంద్రం రిలీజ్‌‌ చేసిన రిపోర్టులో ఉంది. అదే విధంగా రైతుల సమస్యలు కూడా.

రా: ఫార్మల్‌‌ ఎంప్లాయిమెంట్‌‌ డేటా, పెద్ద ఎత్తున నిర్మాణమవుతున్న ఫార్మల్‌‌ ఇన్‌‌–ఫార్మల్‌‌ ఎంప్లాయిమెంట్‌‌ డేటా ఈ రెండిటినీ పరిగణనలోకి తీసుకుని ఈ దేశంలో ఉద్యోగ ఉపాథి అవకాశాలు ఏ విధంగా ఉంటున్నాయనేది అంచనా వేయాల్సి ఉంటుంది. దేశంలో కొత్త ఎయిర్‌‌పోర్టులు నిర్మాణమవుతున్నాయి. కొత్త హైవేలు నిర్మాణమవుతున్నాయి. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ చాలా గొప్పగా పెరుగుతూ వస్తోంది. విదేశీ కంపెనీలు, ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంప్లాయిమెంట్‌‌ జరగడం లేదంటే….!

మోడీ ఇంత మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చాక సంఘ్‌‌ ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. బీజేపీ ఎప్పుడూ వ్యక్తి పార్టీ కాదు. ఇప్పుడు మోడీ, అమిత్‌‌ షాల పార్టీ అయిపోయిందని విమర్శించేవాళ్లు మీ పార్టీలోనే ఉన్నారు.

రా: మా పార్టీలో అలాంటివాళ్లెవరూ లేరు. ఉల్టా మోడీ, అమిత్‌‌ షాలాంటి గొప్ప నాయకత్వం మా పార్టీలో ఉన్నందుకు మాకు గర్వం.

మోడీ తర్వాత నెంబర్‌‌ టూ అమిత్‌‌ షానేనా? అందుకనే ఆయన్ని హోం మంత్రిని చేశారా?

రా: తప్పనిసరిగా మా పార్టీలో అమిత్‌‌ షా ప్రముఖమైన నాయకులు. గత అయిదేళ్లలో బీజేపీని ఎన్నో నూతన శిఖరాలకు తీసుకెళ్లడంలో. ఆయనది ఇన్‌‌వాల్యూబుల్‌‌ కంట్రిబ్యూషన్‌‌. ఇక, కేబినెట్‌‌లో ఎవరిని ఏ పదవిలో ఉంచాలనేది ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. వారందరూ కూడా కేబినెట్‌‌లో ప్రముఖ బాధ్యతలు వహించేవారే.

ఇప్పడు అమిత్‌‌ షా స్థానంలో కొత్త అధ్యక్షుడు రావాలి. రామ్‌‌ మాధవ్‌‌ అయ్యే అవకాశం ఉందా?

రా: కొత్త అధ్యక్షుడు వచ్చే ప్రక్రియ ఇంకా నాలుగైదు నెలలు పడుతుంది. పార్టీని నడిపించగల యోగ్యత, అర్హత కలిగిన నాయకులు మాకు చాలామంది ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యాక పార్టీ అధ్యక్షుడిగా యోగ్యమైన నాయకుడిని ఎన్నుకోవడమవుతుంది. ఈ ఏడాది చివరినాటికి మాకు కొత్త అధ్యక్షుడు ఎన్నిక అవుతారని అనుకుంటున్నా.

బీజేపీలో సౌత్‌‌ ఇండియన్‌‌ లీడర్లకు ప్రాముఖ్యత ఉండదని…

రా: మీ ముందున్న వ్యక్తి ఎవరు? నేనూ సౌతిండియన్‌‌ లీడర్‌‌నే కదా! ఇవన్నీ ఏమిటంటే, బీజేపీని ఏమీ అనలేక, ఎక్కడి నుంచో  ఏదోక క్రిటిసిజమ్‌‌ని తీసుకొచ్చి అనడమే తప్ప,  మా పార్టీలో అందరికీ అన్ని విధాలుగా ప్రోత్సాహం లభిస్తుంది.

రామ్‌‌ మాధవ్‌‌కి పర్సనల్‌‌గా చాయిస్‌‌ వదిలిపెడితే…కేంద్ర  కేబినెట్‌‌లో చేరతారా లేక పార్టీకి పనిచేసేందుకు ముందుకు వస్తారా?

రా: ఆరెస్సెస్‌‌ నుంచి బీజేపీలోకి పంపించినప్పుడు మాకు ఇచ్చిన ఒకే ఒక మార్గదర్శనం ‘పార్టీని బలోపేతం చేయడానికి నువ్వు పార్టీలోకి వెళ్లాలి.’. అదే పనిని సంఘం చెప్పినంతకాలం, పార్టీ చెప్పినంతకాలం చేస్తూ ఉండడమే మా కర్తవ్యం.

సంఘ్‌‌ ఒకవేళ కేబినెట్‌‌లోకి వెళ్లమంటే కేబినెట్‌‌లోకికూడా వెళ్తారు.

రా: ఆ విషయం సంఘ్‌‌ని అడగండి.

సౌతిండియాలో తమిళనాడు, కేరళ ఎందుకు మీకింత వ్యతిరేకంగా రిజల్ట్స్‌‌ ఇచ్చాయి. మోడీకి దేశమంతా అనుకూలమైతే, అక్కడ ఎందుకు వ్యతిరేక గాలి వీచింది?

రా: ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కాస్త వీక్‌‌ అన్న విషయం మరచిపోవద్దు. కేరళలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 15 శాతం ఓట్లు సాధించి రాజకీయ శక్తిగా ఎదిగాం. అవి సీట్లు గెలవడానికి సరిపోవు.  ఇక్కడ మాకు వ్యతిరేకంగా ఓటు వచ్చింది అనుకునేకంటే, లోకల్‌‌ పరిస్థితుల్లో కాంగ్రెస్‌‌కి బెనిఫిట్‌‌ లభించింది. శబరిమల విషయంలో మేం చేపట్టిన ఆందోళనలు కమ్యూనిస్ట్​ పార్టీ విధానాలపై ప్రజల్లో కోపం పెరగటానికి కారణమయ్యాయి. కానీ దాని ఫలితం మాకు బదులు కాంగ్రెస్​కు దక్కింది. తమిళనాడులో బీజేపీ బలమైన శక్తి కాకపోవటం వల్ల రూలింగ్​ పార్టీపై వ్యతిరేకత డీఎంకేకి, దాని మిత్రపక్షం కాంగ్రెస్​కు కలిసొచ్చింది.   ఆ రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఓట్లతోనే చావుతప్పి కన్నులొట్టపోయినట్టుగా కాంగ్రెస్‌‌కి  50 సీట్లొచ్చినయి.

ఆంధ్రప్రదేశ్‌‌ విషయానికి వద్దాం. మీరు అనుకున్నట్లు గానే చంద్రబాబు ఓటమి జరిగింది. వైఎస్‌‌ జగన్‌‌తో మీరు పొత్తు పెట్టుకోకపోయినా కలిసి పనిచేశారు. కానీ, మీ ఓటు బ్యాంక్‌‌ ఒన్‌‌ పర్సెంట్‌‌ లోపే ఉంది. ఏపీలో జగన్​కి మిత్రపక్షంగా ఉంటారా? ప్రతిపక్షంగా వ్యవహరిస్తారా? అక్కడ మీ రోల్​ ఎలా ఉండబోతోంది?

రా: ఆంధ్రప్రదేశ్​ విషయంలో మాకు ఎలాంటి కన్ఫ్యూజనూ లేదు.  మాకెవరూ మిత్రపక్షాలు లేరు.  ఎవరితోనూ కలిసి పనిచేయలేదు. ఆ రాష్ట్రంలో 1998 తర్వాత మళ్లీ ఇదే స్వతంత్రంగా పోటీ చేసిన సందర్భం.  రిజల్ట్స్​ మాకు నిరుత్సాహం కలిగించిన మాట నిజం. బీజేపీకి ఒక్క శాతం లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. మా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌‌లో ఒక విధమైన పోలరైజేషన్‌‌ జరిగింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని దింపేయడంకోసం ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్సార్‌‌ సీపీని సపోర్టు చేశారు.

చంద్రబాబు నాయుడు మళ్లీ మీ దగ్గరకు వస్తే స్వాగతిస్తారా?

రా: మళ్లీ పొత్తు రాజకీయాలకు పోయే ఆలోచన మాకు లేదు.

అంటే, వైఎస్‌‌ జగన్‌‌ మీకు ప్రతిపక్షం

రా: తప్పనిసరిగా. ఆ రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలను మోడీ తప్పనిసరిగా అందిస్తారు. అయితే, ఆ రాష్ట్రానికి సంబంధించి మా పార్టీ రోల్‌‌ ప్రతిపక్షంగానే ఉంటుంది.

మీరు తెలంగాణలో ఏ ఎజెండాతో ముందుకు వెళ్తారు? హిందూత్వనా, లేక డెవలప్‌‌మెంట్‌‌ ఎజెండానా? కేసీఆర్‌‌ చేసిన ‘హిందూగాళ్లు, బొందుగాళ్లు’ కామెంట్‌‌ని మీరు  ప్రచారంలోకి తెచ్చారు.

ఈ రెండూ వేర్వేరు విషయాలు కాదు. ఒకవేళ ఎవరైనా హిందూత్వ ఎజెండా అన్నాగానీ, అది డెవలప్‌‌మెంట్‌‌ ఎజెండానే.

కేసీఆర్‌‌ ఎన్నికల ప్రచారంలో… నాకంటే గొప్ప హిందువు ఎవరు? నేను యజ్ఞాలు చేశాను. యాగాలు చేశాను అన్నారు. సో, మీ హిందుత్వ ఎజెండాని ఇక్కడ జనం నమ్ముతారా?

ఆయన అలా చెప్పుకుంటూనే పచ్చి మతతత్వ పార్టీ మజ్లిస్‌‌ని చంకలో పెట్టుకుని తిరుగుతూ, మరోవైపున  మంచివాళ్లందరినీ ‘హిందూగాళ్లు బొందుగాళ్లు’ అని నిందిస్తూ… ఇదీ ఆయన ఈ రాష్ట్రంలో చేస్తున్న రాజకీయం.

బీజేపీని ఇప్పటికీ ఉత్తరాది,  హిందీ మాట్లాడే వాళ్ల పార్టీ అనే అంటారు. రీసెంట్​గా హిందీ భాషకు సంబంధించిన వివాదం తలెత్తింది. ఆ భావనను ఎప్పుడు పోగొట్టే అవకాశం ఉంది?.

రా: అసలు ఆ కాన్సెప్టే తప్పు. ఎందుకంటే ఈరోజు కాశ్మీర్​ నుంచి కర్నాటక వరకు, ఇటు తెలంగాణ, అటు గుజరాత్​, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్​, ఒడిశా, నార్త్‌‌ ఈస్ట్​.. ఇవేవీ హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు కావు. ఈ అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ మంచి విజయాన్ని సాధించింది. హయ్యస్ట్​గా బెంగాల్​లో 18 సీట్లు సొంతం చేసుకున్నాం. ఒడిశాలో 8 స్థానాలు సాధించాం. నార్త్‌‌ ఈస్ట్​లో 16 చోట్ల పోటీ చేసి 14 తెచ్చుకున్నాం. అందువల్ల ఇవాళ బీజేపీ పాన్​ ఇండియా పార్టీ.  హిందీపై ఈ మధ్య వివాదం రేకెత్తడం దురదృష్టకరం. అలాంటి పాలసీలేవీ మాకు లేవు. త్రిభాషా సూత్రాన్ని యాజ్​ ఇట్​ ఈజ్​గా అమలుచేయాలన్నదే మా పార్టీ విధానం.

‘మొన్న 303 సీట్లు రావడానికి ప్రధాన కారణం… పుల్వామా ఇన్సిడెంట్‌‌ని, సైనికుల త్యాగాలను బీజేపీ వాడుకుంది. జాతీయ వాదాన్ని రెచ్చగొట్టింది తప్ప రియల్‌‌ ఇష్యూస్‌‌ని, కోర్‌‌ ఇష్యూస్‌‌ని, ఎంప్లాయిమెంట్‌‌గానీ రైతుల సమస్యలను గానీవేటినీ చర్చలోకి రాకుండా చేసింది. అందువల్లనే ఇన్ని సీట్లు వచ్చాయ’ని కాంగ్రెస్‌‌ పార్టీ అంటోంది.

రా: కాంగ్రెస్‌‌ పార్టీకి ఈ దేశ ప్రజల తెలివితేటలమీదే విశ్వాసం లేదు. వాళ్ల దృష్టిలో ఈ దేశ ప్రజలు మూర్ఖులు. నిజానికి ఈ దేశ ప్రజలు అన్ని విషయాలనూ ఆలోచించి, ఎవరు యోగ్యులో నిర్ణయించి మూర్ఖులను ఇంట్లో కూర్చోబెట్టి, బీజేపీని పదవిలో పెట్టారు. ఇప్పుడు ఈ ప్రజలను నిందించే కార్యక్రమం కాంగ్రెస్‌‌ పార్టీ చేస్తున్నది.   రిమెంబర్‌‌ ఒన్‌‌ థింగ్‌‌. నేషనలిజమ్‌‌ మా పార్టీ  డీఎన్‌‌యే.  మా పార్టీ గుర్తింపే నేషనలిజమ్‌‌. దాంట్లో మేమేమీ అపోలాజిటిక్‌‌ కాదు. దానిని మేము ఎన్నికల్లోనే వాడతాం. మిగతా టైములో లోపల పెడతామని ఏమీ లేదు. దటీజ్‌‌ అవర్‌‌ ఐడెంటిటీ.  పుల్వామా విషయంలో మా ప్రభుత్వం దృఢమైన వైఖరి తీసుకుంది. దేశ భద్రతకోసం దృఢమైన స్టాండ్‌‌ తీసుకునే ప్రభుత్వంగా మేము అయిదేళ్లు పనిచేశాం. అది మేము ప్రజలకు తప్పనిసరిగా చెబుతాం.  మీరు ఏ పార్టీ మేనిఫెస్టోనైనా చూడండి. దానిలో నేషనల్‌‌ సెక్యూరిటీకి ఒక చాప్టర్‌‌ ఉండదా? ప్రతి పార్టీకూడా నేషనల్‌‌ సెక్యూరిటీకోసం తాము ఏం చేస్తామో చెప్పి, ప్రజలను ఓట్లు అడుగుతారు. మేమూ అదే చేస్తున్నాం.

రామ మందిర వివాదాన్ని బీజేపీ ఓట్ల కోసమే వాడుకుంటోంది. అది పరిష్కారమైతే ఆ పార్టీకి ఫ్యూచరే ఉండదనే ఆలోచనతోనే దీనిని లాగుతారని అంటారు?. 

రా: రామ మందిరం అంశంలో మా ప్రతిబద్ధతను అనేక సార్లు స్పష్టంగా చెప్పాం. రామ మందిర నిర్మాణం సాధు సంత్​లు, రామజన్మభూమి న్యాయ్​ సంస్థ వాళ్లు కలిసి చేస్తారు. దేవాలయాన్ని గవర్నమెంట్​ కట్టదు. కానీ ఆ దిశలో ఏ ఆటంకాలూ లేకుండా చూడటమే ప్రభుత్వ బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉన్నాం. కేంద్రంలో మోడీ సర్కారు, యూపీలో యోగి గవర్నమెంట్​ దీనికి సిద్ధంగా ఉన్నాయి.  దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల బృందం ఏ రిపోర్ట్​ ఇస్తుందో చూద్దాం.