క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలు.. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ద్విముఖ వ్యూహం

క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలు.. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ద్విముఖ వ్యూహం
  • జీహెచ్​ఎంసీ ఎన్నికలకు ఇక్కడినుంచే ప్రచారం స్టార్ట్​
  • ఇతర పార్టీల కార్పొరేటర్లూ తమతో టచ్​లో ఉన్నారంటూ మైండ్ గేమ్!
  • మజ్లిస్​కు ఓటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయం!.. నేడు అధికారిక ప్రకటన
  • ఓటింగ్​కు దూరంగా బీఆర్ఎస్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోకల్​ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  సరిపడా సంఖ్యా బలం లేకున్నా పోటీకి దిగిన బీజేపీ.. క్రాస్​ఓటింగ్​పైనే ఆశలు పెట్టుకున్నది.  ఇతర పార్టీల కార్పొరేటర్లూ తమతో టచ్​లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడుతున్నది. ఈ స్థానంలో మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా,  ఎంఐఎంకు 49,  బీజేపీకి 25, కాంగ్రెస్​కు 14, బీఆర్​ఎస్​కు 24 ఓట్లు ఉన్నాయి. మ్యాజిక్​ ఫిగర్​57 కాగా.. ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ దాదాపు నిర్ణయించింది. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన రానుండగా, ఇదే జరిగితే 63 ఓట్లతో  ఎమ్మెల్సీ స్థానాన్ని  ఎంఐఎం ఈజీగా కైవసం చేసుకుంటుంది. కాగా,  బీజేపీకి సరైన బలం లేనప్పటికీ బరిలో దిగడం వల్లే  పోటీ అనివార్యమైంది.  వాస్తవానికి  ఎంఐఎంకు సైతం మ్యాజిక్​ ఫిగర్​కు కావాల్సిన సంఖ్యా బలం లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతుపై ఆశలు పెట్టుకున్నది.  కానీ కాంగ్రెస్​ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, తాము పోటీకి దూరంగా ఉంటామని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ప్రకటించడంతో బీజేపీ రంగంలోకి దిగింది. ఇతర పార్టీల కార్పొరేటర్లనూ కలుస్తూ మద్దతు కోరుతున్నది. 

పైగా బీఆర్ఎస్​, కాంగ్రెస్​ కార్పొరేటర్లంతా  తమతో టచ్​లో  ఉన్నారని, తమకే ఓటువేస్తారని, తామే గెలువబోతున్నామని   కమలం పార్టీ నేతలు చెబుతున్నారు.  ఈ ఏడాది చివర్లో జీహెచ్​ఎంసీ ఎన్నికలుండగా.. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ  ప్లాన్ చేస్తున్నది. ఇందుకోసం హైదరాబద్​ లోకల్ ​బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రచారానికి వాడుకోవాలని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఈ ఎలక్షన్స్​కు బీఆర్ఎస్, కాంగ్రెస్ దూరంగా ఉన్నట్టు ప్రకటించడంతో ఇదే అవకాశంగా పావులు కదుపుతున్నారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్​, బీఆర్ఎస్​ కార్పొరేటర్లను కలుస్తూ, తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొందరు కార్పొరేటర్లు తమకు టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. ఎలాగూ గెలిచే అవకాశం లేనప్పటికీ  తమకున్న బలం కంటే ఎన్నో కొన్ని ఓట్లు ఎక్కువ సాధించినా ఆ ప్రభావం రాబోయే జీహెచ్​ఎంసీ ఎన్నికలపై ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. 

బీఆర్ఎస్​ దూరం..

తమకు బలం లేనందున ఈ ఎన్నికలకు బీఆర్ఎస్​ దూరంగా ఉంటుందని, పార్టీ నుంచి విప్​కూడా జారీ చేస్తామని  ఆ పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్ 3 రోజుల క్రితం​ ప్రకటించారు. ఎవరైనా ఎన్నికల్లో పాల్గొంటే సీరియస్ ​యాక్షన్ తప్పదని హెచ్చరించారు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రేటర్​ హైదరాబాద్​లో మేయర్​ పీఠం బీఆర్ఎస్​దే అయినా, కాంగ్రెస్​ సర్కార్​ మారడంతో మేయర్​తో సహా కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరారు.  ఇలా బీఆర్ఎస్‌‌‌‌ కార్పొరేటర్ల సంఖ్య తగ్గడం, పోటీచేసినా గెలిచే అవకాశం లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.