
రంగారెడ్డి జిల్లా : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రంగారెడ్డి జిల్లా నాయకులు రోడ్డెక్కారు. రాష్ట్రంలో 18 లక్షల మందికి పైగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ.. ఇబ్రహీంపట్నంలో ధర్నా చేపట్టారు. సాగర్ రహదారిపై బీజేవైఎం నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన నాయకులను అదుపులోకి తీసుకుంటుండగా ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులకు, బీజేవైఎం నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
విద్యను నిర్వీర్యం చేస్తున్నారు : భానుప్రకాష్
ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ ను వెంటనే విడుదల చేయకపోతే ప్రగతిభవన్ గోడలు బద్దలు కొడుతామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ హెచ్చరించారు. విద్యను నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. ఫీజులు చెల్లించాలంటూ విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లోనూ రాస్తారోకోలు చేపట్టాలంటూ బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ, బీజెవైఎం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.