- మాజీ రౌడీషీటర్ నుంచి బాబాగా అవతారమెత్తిన కలీం
చాంద్రాయణగుట్ట, వెలుగు: పాతబస్తీలో బ్లాక్ మ్యాజిక్ బాబాగా అవతారమెత్తి అమాయకులను మోసం చేస్తున్న ఓ మాజీ రౌడీ షీటర్‌ను సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బహదూర్ పురాలోని హసన్ నగర్ కు చెందిన మహమ్మద్ కలీం(48) మాజీ రౌడీ షీటర్. ఇతడిపై కాలాపత్తర్ పోలీస్‌స్టేసన్‌లో రౌడీషీట్ఉండేది. ఈ మధ్య మంత్ర, తంత్రాలు చేసి అనుకున్న కోర్కెలు నెరవేరుస్తానని బ్లాక్ మ్యాజిక్ బాబా అవతారం ఎత్తాడు. పాతబస్తీకి చెందిన నజియా తన అత్తమామలను బ్లాక్ మ్యాజిక్ చేసి అంతమొందించాలని కలీమ్‌ను కలిసింది. దీంతో అతడు 48 గంటల్లో వారిని అంతం చేస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నాడు. గోధుమ పిండితో బొమ్మలు తయారు చేసి వాటిపై నజియా అత్తమామల ఫొటోలు పెట్టాడు.
పసుపు, కుంకుమ చల్లి నల్ల నువ్వులు, లవంగాలు, నిమ్మకాయలు పెట్టి సూదులు గుచ్చుతూ వీడియో తీశాడు. దీన్ని నజియా అత్తమామలకు పంపి 48 గంటల్లో కుటుంబమంతా చనిపోబోతుందని బెదిరించాడు. దీంతో వారు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బహదూర్‌పురా పోలీసులతో కలిసి కలీమ్‌ను అరెస్ట్‌చేశారు. చేతబడి కోసం ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడుపై ఐదు పోలీస్స్టేషన్లలో హత్య, హత్యాయత్నం, దొంగతనం, మోసాలు తదితర కేసులున్నాయని చెప్పారు. నిందితుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సీఐ ప్రసాద్‌వర్మ టీమ్ ను అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అందే శ్రీనివాస్ రావు అభినందించారు. కేసును బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.