
కరీంనగర్ జిల్లాలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపింది. కరీంనగర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని దుర్శేడ్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో దుండగులు క్షుద్ర పూజలు చేసి వెళ్లడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. విద్యార్థులు స్కూల్ కు రావడంతో తరగతి గది ముందు వరండాలో క్షుద్రపూజలు కనిపించడంతో దూరంగా నిలబడి ప్రిన్సిపాల్ కు ఫోన్ చేశారు.
బుధవారం (19 ఫిబ్రవరి) రాత్రి స్కూల్ భవనం హెచ్ఎం గది ముందు నిమ్మకాయలు, పసుపు కుంకుమతో పెట్టి ముగ్గు వేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం స్కూల్ వచ్చిన విద్యార్థులు, ఆయాలు గమనించి ప్రిన్సిపల్ కు సమాచారం అందించారు.
క్షుద్రపూజలు చూసి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. క్లాస్ రూమ్ లలోకి వెళ్లకుండా స్కూల్ ఆవరణలోనే టీచర్లు, ప్రిన్సిపల్ వచ్చే వరకు ఎదురు చూశారు. ప్రిన్సిపల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో.. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.