జ్వరం తగ్గట్లేదని క్షుద్ర పూజలు.. మూఢ నమ్మకాలకు బలైన యువకుడు

చెన్నూరు, వెలుగు: కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ యువకుడు హాస్పిటల్​కు వెళ్లకుండా క్షుద్రపూజలను నమ్ముకుని.. చివరికి మృతి చెందాడు. మృతుడి బంధవులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని బొక్కలగూడెం కాలనీకి చెందిన దుర్గం లచ్చయ్య, లక్ష్మి పెద్ద కొడుకు మధు(33) ట్రాక్టర్ డ్రైవర్. నెల రోజులుగా తరచూ జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక హాస్పిటల్​లో చూపించుకున్నా, జ్వరం తిరగబెడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆదివారం శ్రీరాంపూర్ కు చెందిన  క్షుద్రపూజలు చేసే తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. రాత్రి చెన్నూరులోని గోదావరి తీరంలో మధుకు క్షుద్రపూజలు చేయించారు. పూజలు నిర్వహిస్తున్న క్రమంలో మధు తీవ్ర అస్వస్తతకు గురై అక్కడే మృతి చెందినట్లు సమీప బంధువులు చెబుతున్నారు. రాత్రి సమయంలో మధు మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా, కాలనీవాసులు అడ్డుకున్నారు.

తాంత్రిక పూజలతో చనిపోయిన వ్యక్తిని ఇక్కడికి ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. క్షుద్రపూజల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమవారం ఉదయం గోదావరి తీరంలో మధు మృతదేహానికి అంత్యక్రియలు జరిపిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెన్నూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయంపై సీఐ వాసుదేవరావును సంప్రదించగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులను, తాంత్రికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు.