లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి.. బ్లాక్మెయిల్ చేస్తున్న కిలేడీలు అరెస్టు

  లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి.. బ్లాక్మెయిల్ చేస్తున్న కిలేడీలు అరెస్టు

మీరెప్పుడైనా ఎవరైనా లిఫ్ట్ అడిగితే సహాయం చేశారా.. చేసే ఉంటారు. అందులో మహిళలైతే దాదాపు అందరూ లిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే వారు అసహాయ స్థితిలో ఉండవచ్చు.. లేదా ఏదైనా ఇబ్బందుల్లో ఉండవచ్చు.. సాయం చేద్దాం లే అని లిఫ్ట్ అడిగిన వెంటనే డ్రాప్ చేస్తుంటాం. అది అందరిలో ఉండే సహాయగుణం.. మానవత్వం. కానీ దాన్నే అలుసుగా తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేసే మహిళామణులు ఎదురైతే ఏంటి పరిస్థితి. హైద్రాబాద్ సిటీలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 

హైద్రాబాద్ మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఇలాంటి బెదిరింపులకు పాల్పడి పోలీసులకు దొరికి పోయారు. మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్‌గూడకు చెందిన వెన్నెల ఇద్దరూ బంధువులు. గత కొంత కాలంగా ఏ కష్టం లేకుండా డబ్బులు సంపాదించేందుకు అద్భుతమైన ప్లాన్ వేశారు. వాహనదారులను లిఫ్ట్ అడగడం.. నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేయడం వీరికి అలవాటుగా మారింది. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి డబ్బులు ఇస్తావా లేదా అని అడుగుతారు. ఎందుకివ్వాలి అని ప్రశ్నిస్తే.. తమను లైంగిక దాడికి యత్నించావని కేసు పెడతామని బెదిరిస్తారు. కుటుంబం రోడ్డున పడుతుందని భయపెడతారు. 

ఈ కిలేడీల బ్లాక్ మెయిల్ కు భయపడి ఎందుకొచ్చిన తంటా అని డబ్బులు ఇచ్చి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి తగిన శాస్తి జరిగిందని కామ్ గా వెళ్లటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి వాహనదారులది. కానీ పదే పదే అలుసుగా తీసుకొని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి డబ్బులు గుంజుతుండటంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వీళ్ల భాగోతం బయట పడింది. 

ALSO READ | మీ బైక్ పార్క్ చేస్తున్నారా? జాగ్రత్త.. పార్కింగ్ చేసిన వాహనాలే వాళ్ల టార్గెట్

జెన్‌కోలో పని చేస్తున్న ఒక వ్యక్తి నవంబర్‌ 6న సాయంత్రం బైక్‌పై నాగారంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. తార్నాక బస్టాండ్‌ వద్ద నిలుచుని ఉన్న భాగ్య అతడిని లిఫ్ట్‌ అడిగింది. లాలాపేటలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌ వద్దకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్‌ చేసింది. అతను డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించగా.. తనను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఫోన్‌పే ద్వారా రూ. 95 వేలు బదిలీ చేయించుకుంది. అనంతరం అతడితో పాటు కుషాయిగూడకు వెళ్లి ఏటీఎం ద్వారా రూ. 55 వేలు విత్‌డ్రా చేయించి లాక్కుంది. 

అంతే కాకుండా ఈ నెల 3న ఆమె తన బంధువు వెన్నెలతో సదరు వ్యక్తికి ఫోన్‌ చేయించి డీటీడీసీ కొరియర్‌ వచ్చిందని, కుషాయిగూడ డీమార్ట్‌ వద్దకు వచ్చి తీసుకెళ్లమని కోరింది. ఆమె మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన అతడిని వారిద్దరు మళ్లీ బెదిరించి రూ. 1.7లక్షలు వసూలు చేశారు. సదరు వ్యక్తిని టార్గెట్‌ చేసిన వీరు ఈ నెల 23న అతని ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా గుర్తించిన బాధితుడు లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వీరిపై ఇది వరకే పలు పోలీస్‌స్టేషన్లలో ఇదే తరహా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.