
Market Crash: దశాబ్ధాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సోమవారం పతనాన్ని నమోదు చేసి బ్లాక్ మండేగా నిలిచింది. అయితే నేడు పెట్టుబడిదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించటంలో మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. అలాగే ట్రంప్ టారిఫ్స్ పై దేశాలు సైతం చర్చలు ప్రారంభించటంతో భయాలు మెల్లగా తొలగుతున్నాయి. అయితే చాలా మంది ఈ విధ్వంసం నిన్నటితో ముగిసిందని భావిస్తున్నప్పటికీ ముందు మరింత భయానక పరిస్థితులు ఏర్పడనున్నట్లు వచ్చిన ఒక వార్త ఇన్వెస్టర్లకు కునుకులేకుండా చేస్తోంది.
బ్లాక్‌రాక్ సీఈవో ఏమన్నారంటే..
ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పెట్టుబడి సంస్థల్లో ఒకటిగా ఉన్న బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్ ప్రస్తుతం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని పరిస్థితులపై కీలక విషయాలను బయటపెట్టారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాలు పెరిగితే మార్కెట్లు మరో 20 శాతం వరకు పతనాన్ని నమోదు చేస్తాయని హెచ్చరించారు. అనేక కంపెనీల సీఈవోలతో మాట్లాడినప్పుడు వారు ప్రస్తుతం మాంద్యంలోకి జారుకుంటున్నట్లు తనకు చెప్పినట్లు ఫింక్ వెల్లడించారు. ట్రంప్ విధించిన భారీ సుంకాలతో ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అదుపుతప్పుతుందని, ఇది మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీయవచ్చని ఆయన అన్నారు.
ఈ క్రమంలోనే ఆయన చెడుకాలం ఇంకా ముగియలేదని.. ఇక్కడి నుంచి మార్కెట్లు మరో 20 శాతం తగ్గుదలను చూస్తాయని బ్లాక్ రాక్ సీఈవో అంచనా వేశారు. పరిస్థితులు దిగజారితే దీనికంటే కిందకు కూడా మార్కెట్లు పతనమైన ఆశ్చర్యపోనక్కర్లేదని వెల్లడించారు. వాస్తవానికి అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని ప్రపంచ దేశాలపై 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేయాలని పరిశీలిస్తున్నారనే నివేదిక మార్కెట్లను శాంతింపజేసింది. అయితే వైట్ హౌస్ అధికారులు మాత్రం ఇందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఇదొక ఫేక్ వార్తగా వారు కొట్టిపడేశారు.
Also Read:-క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్‌కి దెబ్బే.. ఇలా చేస్తే సేఫ్..!
ఈ పరిస్థితుల్లో ట్రంప్ అమెరికాలో ప్రజల నుంచి వ్యతిరేకతను చూస్తున్నప్పటికీ తన పని తాను చేసుకుపోతున్నారు. ఇటు భారత్ సైతం టారిఫ్స్ నుంచి రిలీఫ్ కోసం ఇరుదేశాలకు అనుకూలమైన ప్రతిపాదనలతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. వాణిజ్యం దెబ్బతినకుండా పరిశ్రమలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చర్యలు స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలోని ఆక్వా రైతులు సైతం ట్రంప్ టారిఫ్స్ వల్ల భారీ నష్టాలను చూస్తున్నారు. మెుత్తానికి మార్కెట్లలో ఇన్వెస్టర్లు రానున్న కొన్ని వారాలు అప్రమత్తంగా వ్యవహరించటం ముఖ్యం. అలాగే రేపు రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ ప్రకటన కోసం కూడా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే పరిస్థితులను భారత స్టాక్ మార్కెట్లోని ఆప్షన్స్ చైన్ డేటా కన్ఫమ్ చేస్తోంది. బుల్ ర్యాలీ కొనసాగుతుందనే నమ్మకం తక్కువగా ఉన్నట్లు ఇవి సూచిస్తున్నాయి. అయితే భారీ ఒడిదొడుకులు ఉండొచ్చని ట్రేడర్స్ ముందుకెళుతున్న తీరు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను పట్టిపీడిస్తున్న అనిశ్చితికి భారతీయ డెరివేటివ్స్ మార్కెట్ ప్రతిబింబిస్తోంది. ప్రపంచ అస్థిరత పెరగడం, సంస్థాగత ప్రవాహాలు జాగ్రత్తగా మారడంతో, వ్యాపారులు తమ వ్యూహాలను వేగంగా మార్చుకుంటున్నారు. చాలా మంది భద్రత వైపు మళ్లడంతో పాటు దూకుడుగా హెడ్జింగ్ చేయడం, భారీగా మార్కెట్లు పడితే దాని నుంచి లాభాలను పొందాలని కూడా చూస్తున్నట్లు ఆప్షన్స్ కాంట్రాకుల డేటా ప్రకారం తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.