అక్రమ బాణసంచా యూనిట్‌లో పేలుడు.. ఇద్దరు మృతి

అక్రమ బాణసంచా యూనిట్‌లో పేలుడు.. ఇద్దరు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని ఓ ఇంట్లో అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక బాలుడు సహా మరొకరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో  అత్యవసర వైద్యం కోసం లక్నో మెడికల్ కాలేజీకి తరలించారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాగద్‌గంజ్ గ్రామంలోని మహ్మద్ ఫరూఖ్ నివాసంలో బాణాసంచా తయారుచేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. సోమవారం(అక్టోబర్ 07) మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో చుట్టుప్రక్కల ప్రజలు భయంతో దుకాణాలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ALSO READ | బొగ్గుగనిలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

మృతులను ఆకాష్ (15), లల్లు (30)గా గుర్తించారు. ఇంటి యజమాని పంజాబ్‌లోని జలంధర్‌లో నివసిస్తున్నారని, పేలుడు సంభవించినప్పుడు కొంతమంది బాణాసంచా తయారుచేస్తున్నారని ప్రత్యక్ష సాక్షి జాతీయ మీడియాకు వెల్లడించారు. పేలుడు ధాటికి ఇంటి గోడ కూలిపోయి పక్కనే ఉన్న ఇళ్లకు పగుళ్లు వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కాగా, అక్టోబరు 2న బరేలీ జిల్లాలోని ఒక గ్రామంలో బాణసంచా తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించి కనీసం ఆరుగురు మరణించారు.