ఢిల్లీలో బాంబు పేలింది.. నార్త్ ఢిల్లీలోని పీవీఆర్ థియేటర్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. 2024, నవంబర్ 28వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో.. స్థానికుల నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఫైరింజన్స్, అంబులెన్సులు అన్నీ ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఉత్తర ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ లోని పీవీఆర్ మల్టీఫ్లెక్స్ సమీపంలోని ఓ స్వీట్ షాపులో ఈ పేలుడు జరిగినట్లు గుర్తించారు పోలీసులు. తనిఖీలు చేయగా తెల్లటి పొడి లాంటి పదార్థం ఆనవాళ్లు ఉన్నాయని.. వాటిని పరీక్షల కోసం పంపించినట్లు వెల్లడించారు పోలీసులు.
ఈ పేలుడు ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఎవరూ గాయపడలేదని ప్రకటించారు పోలీసులు. సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఇది ఎలాంటి బాంబు అనేది విచారణ చేస్తున్నారు. బాంబు నిల్వ చేయటం వల్ల పేలిందా లేక ఎవరైనా టార్గెట్ చేశారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు.
ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. ఢిల్లీలో పేలుడు అనే వార్తలు కలకలం రేపాయి. దీంతో ఢిల్లీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ కూడా అప్రమత్తం అయ్యింది. అన్ని కోణాల్లోనూ విచారణ వేగవంతం చేశారు పోలీసులు.