హైదరాబాద్ నగర శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. 2024, డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం పీఎస్ ఆవరణలో చెత్త తగలబెడుతుంటే.. అందులోని గుర్తు తెలియని వస్తువు పేలింది. భారీగా బ్లాస్ట్ జరగడంతో శాంతమ్మ అనే స్వీపర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. శాంతమ్మను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
స్టేషన్లో సీజ్ చేసి ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతోనే ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. పీఎస్ ఆవరణలో జరిగిన ఈ పేలుడు విషయాన్ని హయత్ నగర్ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. పేలుడు ఘటనపై పోలీసులు ఇంటర్నల్‌గా ఎంక్వైరీ చేస్తోన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.