- నియో పోలిస్ ఏరియాలో ఒకేసారి పది చోట్ల డిటోనేటర్లను పేల్చిన కంపెనీ
- బండరాళ్లు పడడంతోపలువురికి గాయాలు
గండిపేట, వెలుగు : రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పోలిస్ ఏరియాలో బ్లాస్టింగ్ కలకలం రేపింది. ఓ నిర్మాణ సంస్థ శుక్రవారం ఒకేసారి 10 చోట్ల డిటోనేటర్లు పెట్టి బ్లాస్టింగ్ చేసింది. దీంతో బండరాళ్లు గాల్లోకి లేచి సమీపంలోని ఇండ్లు, లేబర్ అడ్డాలపై పడ్డాయి. అలాగే అక్కడే ఉన్న అయ్యప్పస్వాములు సన్నిదాన శిబిరంపై రాళ్లు పడడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో అనేక వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి.
ఒకేసారి పది చోట్ల బ్లాస్టింగ్ జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో నిర్మాణ సంస్థపై స్థానికులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో చాలా రోజులుగా బ్లాస్టింగ్‌లు జరుగుతుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.