హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​లో పేలుడు

హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​లో పేలుడు
  • పేరుకుపోయిన చెత్తను కాల్చుతుండగా ఘటన 
  • పేలుడు ధాటికి గాయపడిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది 
  • ఇండ్లలోంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు
  • ధ్వంసమైన స్టేషన్ గోడ, సీజ్డ్ వస్తువుల స్టోర్ షెడ్డు 

ఎల్ బీనగర్, వెలుగు : హైదరాబాద్ లోని హయత్​నగర్​పోలీస్ స్టేషన్​లో పేలుడు ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. స్టేషన్ లో ఆవరణలో పేరుకుపోయిన చెత్తను కాలుస్తుండగా ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరిగింది. దీంతో ఒకరు  గాయపడ్డారు. స్టేషన్ గోడ, షెడ్డు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. హయత్ నగర్ పోలీసు స్టేషన్ ఆవరణలో కొంతకాలంగా చెత్తా చెదారం పేరుకుపోయింది. 

శుక్రవారం స్టేషన్ ఔట్​సోర్సింగ్​సిబ్బంది సూర్యకళ, జీఎంఆర్ సిబ్బంది ఇద్దరూ కలిసి క్లీన్​చేస్తూ చెత్తను ఒకచోట పోసి నిప్పుపెట్టారు. అదే సమయంలో గుర్తు తెలియని వస్తువు భారీ శబ్దంతో పేలింది. దీంతో స్టేషన్​గోడ, సీజ్ వస్తువుల స్టోర్​షెడ్డు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. పేలుడు ధాటికి సూర్యకళ నుదిటిపై, కంటిపై గాయాలయ్యాయి. వెంటనే ఆమెను వనస్థలిపురంలోని కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్ మెంట్ అందించారు. స్టోర్ రూమ్ లో సీజ్ చేసిన డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ ఉండగా, అవి చెత్తలో వచ్చి బ్లాస్ట్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం ఖాళీ బాటిల్స్, టైర్లు, చెత్తతోనే బ్లాస్టింగ్ జరిగిందని తెలిపారు. 

పేలుడుతో  సీజ్ చేసిన వస్తువులు పెట్టే షెడ్డు కొంత ధ్వంసమైంది. స్టేషన్ గోడ కూలి రాళ్లు కింద పడిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అదే సమయంలో పీఎస్ ఆవరణలో వివిధ పనులపై వచ్చిన ఫిర్యాదుదారులు చెవులు కొద్ది సేపు వినపడకుండా పోయాయని చెప్పారు. 

స్థానికులు కూడా భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బాంబ్, డాగ్ స్వ్కాడ్ ఘటన స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. రిపోర్టు వచ్చిన తర్వాత బ్లాస్టింగ్ కారణాలు తెలుస్తాయని హయత్ నగర్ పోలీసులు తెలిపారు.