ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వండి..తహసీల్దార్ ఆఫీస్ ముందు అంధుడు ఆందోళన

ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వండి..తహసీల్దార్ ఆఫీస్ ముందు అంధుడు ఆందోళన

గూడూరు, వెలుగు: ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఓ అంధుడు కుటుంబంతో కలిసి ఆందోళనకు దిగాడు. బాధితుడి వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్ పల్లికి చెందిన బొలగాని చిన బాలయ్య అంధుడు. అతనికి కొన్నేండ్ల కింద అప్పటి ప్రభుత్వం ఇంటి జాగా కేటాయించింది. ఆ సమయంలో తన వద్ద పైసలు లేకపోవడంతో ఇంటిని నిర్మించుకోలేదు.

అయితే, ఇటీవల ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. దీంతో ఇది ప్రభుత్వ స్థలమని, అందులో ఎలాంటి నిర్మాణం చేయొద్దని తహసీల్దార్ పనులను ఆపి వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తనకు కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని శనివారం తహసీల్దార్ ఆఫీస్ ముందు కుటుంబంతో కలిసి ఆందోళనకు దిగాడు.

ఈ విషయంపై తహసీల్దార్ శ్వేతను వివరణ కోరగా, 15 ఏండ్ల కింద ప్రభుత్వ భూమిని కొంతమందికి ఇంటి స్థలాలుగా కేటాయించినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం మూడేండ్లలో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోతే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. ప్రస్తుతం అక్కడ స్థలం అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉందని, కేసు కోర్టులో నడుస్తుందన్నారు.