
- తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు
కాగజ్‌నగర్, వెలుగు: పేదరికం, అంధత్వం అతనికి అడ్డు రాలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో కష్టపడ్డాడు. తొలి ప్రయత్నంలోనే లక్ష్యం సాధించి అందరి మెప్పు పొందాడు. ఈయనే ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలానికి చెందిన పందిర్ల అనిల్. తల్లిదండ్రులు కూలీ చేస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో.. చూపు లేకున్నా కష్టపడి ఉన్నత చదువులు చదివాడు. ఇటీవలే పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై, గ్రామానికి సేవ చేస్తున్నాడు.
ఎనిమిదేళ్ల వయసులో అనిల్ దహెగాంలోనే నాల్గో తరగతి చదువుతుండగా ప్రమాదవశాత్తు కళ్లకు దెబ్బతగిలి చూపు కోల్పోయాడు. అయిదో తరగతి నుంచి పదో తరగతి వరకు కరీంనగర్ లోని ప్రభుత్వ అంధుల పాఠశాలలో తెలుగు మీడియంలో బ్రెయిలీలో చదివాడు. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని నేత్ర విద్యాలయంలో చదివాడు. ఇంగ్లీషు మీడియంలో సీఈసీ విభాగంలో 88 శాతం మార్కులు సాధించాడు. అక్కడే డిగ్రీ బీకాం చదివి, 89 పర్సెంటీజీతో పాసయ్యాడు.
ఉస్మానియా యునివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్, చదివి ఇంకో వ్యక్తి సహాయంతో పరీక్ష రాసి పాసయ్యాడు. అనంతరం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ పరీక్షకు ప్రిపేర్ అయి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పరీక్ష రాశాడు. 87 మార్కులతో బీసీ కోటాలో ఉద్యోగం సాధించాడు. అనంతరం సొంత మండలంలోని బామనగర్ పంచాయతీకి కార్యదర్శిగా నియమితులయ్యాడు.