చౌటుప్పల్ వెలుగు: పీసీసీ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతే బీఆర్ఎస్‌కు కోవర్ట్‌లా వ్యవహరిస్తోందని చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని రాజీవ్ భవన్ కార్యాలయంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాల అధ్యక్షులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన మండల అధ్యక్షులను ఉద్దేశిస్తూ కోవర్టులకే పదవులు అప్పజెప్పారని పాల్వాయి స్రవంతి ఆరోపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
మునుగోడు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిపై ఇలా కామెంట్ చేయడం సరికాదని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో తిరిగితే ఎవరూ పార్టీ కార్యకర్తలో, ఎవరు కోవర్టులో తెలుస్తుందన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డి నేతృత్వంలో పార్టీ బలపడుతుంటే ఆమె ఓర్వడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాల అధ్యక్షులు బోయ దేవేందర్ ఏపూరి సతీష్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహ, నేతలు కేతరజు అచ్చయ్య, జిండ్ర అంజిరెడ్డి, ఖయ్యాం, బత్తుల శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.