నిషేధం ముసుగులో ఆటో డీలర్ల బ్లాక్​ దందా!

  • సిటీలో ఫైనాన్షియర్లు, డీలర్ల మాయాజాలం
  • కొత్త ఆటోకు పర్మిట్​ ఇవ్వాలంటే పాతది స్ర్కాప్​చేయాల్సిందే
  •    పక్క జిల్లాల్లో కొనుగోలు చేసి సిటీలో నడుపుతున్న ఆటోవాలాలు
  •    ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తామంటున్న అధికారులు
  •   కేరళ మాదిరి ఎక్కడైనా నడిపేలా అవకాశం ఇవ్వాలని ఆటో సంఘాల డిమాండ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో కొత్త ఆటోలపై నిషేధం కొందరు డీలర్లు, ఆర్టీఏ అధికారులు, ఫైనాన్షియర్స్‌‌‌‌‌‌‌‌కు వరంలా మారింది.  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో 2002లో  సిటీలో  కొత్త ఆటోలపై నిషేధం విధించారు. నిషేధం నాటికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 50 వేలలోపు ఆటోలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య లక్షకు చేరింది.  నిషేధం ఉన్నా గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు, ప్రత్యేక ఉపాధి పథకం కింద కొన్ని ఆటోలు కొనుక్కోవడానికి అనుమతులిచ్చింది.  దీంతో ఈ 22 ఏండ్లలో నగరంలో ఏడాదికి కనీసం వెయ్యి చొప్పున ఆటోలు పెరుగుతూ పోయాయి.

పక్క జిల్లాల్లో ఆటోలను కొని రిజిస్ట్రేషన్​ చేసుకుని సిటీలో నడుపుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది.  రూల్స్​ ప్రకారం ఇతర జిల్లాల ఆటోలు సిటీలో నడిపేందుకు అనుమతి లేదు. కానీ, కొందరు ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం వల్ల విచ్చలవిడిగా ఆటోలు సిటీలో తిరుగుతున్నాయని యూనియన్ లీడర్లు చెప్తున్నారు.   సిటీలో ఆటోలపై నిషేధం కారణంగా కొత్తగా ఆటో కొనాలనుకునే వారు వారి దగ్గరున్న పాత ఆటోలను  స్క్ర్రాప్ ​చేసి ఆర్టీఏ నుంచి ప్రొసీడింగ్స్​(పర్మిట్) తీసుకోవాలి. దీని తర్వాత కొత్త ఆటోలకు ఫైనాన్స్​ కోసం వెళ్తే ఎస్టిమేషన్​రూ.3.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వేసి ఇస్తున్నారు. అక్కడి నుంచి షోరూమ్​కు వెళ్తే  వారు కూడా రూ.2.50 లక్షలకు అమ్మాల్సిన ఆటో ధరను రూ. 5 లక్షల నుంచి రూ.5.60 లక్షలు చెప్తున్నారు. ఇక్కడే డీలర్లు, ఫైనాన్షియర్లు కుమ్మక్కవుతున్నారు.  దీంతో ఆటో కొనాలనుకునే వారు రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తోంది. కానీ, ఆటో డీలర్​ మాత్రం కొనుగోలుదారుడికి ఇన్వాయిస్​ రూ. 2.60 లక్షలకే ఇస్తున్నారు.  అంటే డీలర్​, ఫైనాన్షియర్​ కుమ్మక్కయినట్టు స్పష్టంగా అర్ధం అవుతోంది.

ఇంత భారీ మొత్తంలో అప్పుచేసి ఆటో కొనుగోలు చేయడం తమకు భారంగా మారుతోందని కొందరు ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు.  కొందరు ఫైనాన్షియర్లు పక్కజిల్లాలకు వెళ్లి ఆటో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయా జిల్లాల ఆర్టీఏ అధికారులను కలుపుకొని ఇలా చేస్తున్నట్లు సమాచారం.  హైదరాబాద్​లో ఉండే వారు కూడా ఆయా జిల్లాల్లో ఉన్నట్టుగా కొన్ని అడ్రస్​లను సృష్టిస్తున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్​కు 10 వేల నుంచి 20వేలు వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆటోల ధర విషయానికి వస్తే డీలర్లు  2.50 లక్షల నుంచి 2.70 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. 

ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తాం

హైదరాబాద్​ పరిధిలో ఇతర జిల్లాల ఆటోలు తిరుగుతున్నాయన్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని వెంటనే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తామని ఆర్టీఏ జాయింట్​ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ రమేశ్ ​కుమార్​ వెల్లడించారు. అనుమతి లేకుండా నగరంలో నడిచే ఆయా వాహనాలకు జరిమానాలు కూడా విధిస్తామని పేర్కొన్నారు.

కేరళ మాదిరిగా పర్మిషన్లు ఇవ్వాలి

హైదరాబాద్​లో ఉన్న డ్రైవర్లకు ఆటోల కొనుగోలు భారంగా మారిన నేపథ్యంలో నిషేధాన్ని తొలగించి కేరళలో మాదిరిగా రాష్ట్రంలో ఎక్కడైనా ఆటో నడుపుకునేలా పర్మిషన్​ ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్​అండ్​ వర్కర్స్​ యూనియన్​ గ్రేటర్ ​హైదరాబాద్​ అధ్యక్షుడు సబంకర్​ దయానంద్​ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విధానాన్ని అమలు చేస్తే ఆటోల బ్లాక్​మార్కెట్​ దందాను అరికట్టడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఆటోడ్రైవర్లు ఎక్కడైనా నడుపుకొనే అవకాశం ఉంటుందన్నారు.