బుల్డోజర్లకు అడ్డుపడండి.. ఒక్కరి ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి

బుల్డోజర్లకు అడ్డుపడండి.. ఒక్కరి ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి
  • రేవంత్ ​కాదు.. ఆయన తాతొచ్చినా ఏమీ చేయలేడు: కేటీఆర్
  • ఆర్​బీ–ఎక్స్​ను చెరిపేసి  కేసీఆర్​ అని రాయండి
  • మూసీమే లూఠో.. ఢిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్‌ నినాదం 
  • తాటాకు చప్పుళ్లకు భయపడం
  • మూసీ ప్రాజెక్టు పరిధిలోని గోల్నాకలో పర్యటన

హైదరాబాద్, వెలుగు: మూసీలోని ఇండ్ల వద్దకు బుల్డోజర్‌‌ వస్తే కంచె అడ్డుపెట్టాలని, అందరూ కలిసి తగులుకోవాలని ఆ ప్రాంత ప్రజలకు బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇండ్లపై ఆర్​బీ–ఎక్స్​ అని చెరిపేసి కేసీఆర్​ అని రాయండి అని సూచించారు. రేవంత్ రెడ్డి కాదు.. ఆయన తాత వచ్చినా ఏమీ చేయలేరని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌‌లో సగం డబ్బులతో మూసీ ప్రక్షాళన చేపట్టారని, మూసీ పరీవాహక ప్రాంతవాసులను అడవిలోకి పంపుతున్నారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌‌లో బీఆర్‌‌ఎస్‌‌కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగపట్టారని, మూసీమే లూఠో.. ఢిల్లీ మే బాంటో (మూసీలో దోచుకొని.. ఢిల్లీకి డబ్బులు కట్టాలి) అనేది కాంగ్రెస్‌‌ నినాదమని పేర్కొన్నారు. మూసీ డెవలప్‌‌మెంట్ ప్రాజెక్టు పరిధిలోని గోల్నాక తదితర ప్రాంతాల్లో కేటీఆర్ మంగళవారం​పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌లో లక్షలాది మందికి కాంగ్రెస్​ సర్కారు నిద్రలేకుండా చేసిందని పేర్కొన్నారు. ఎప్పు డు.. ఎక్కడ ఇండ్లు కూల్చుతారో అని ప్రజలు ఆవేదనలో ఉన్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నామని చెప్పి.. ఉన్న ఇండ్లు కూల్చుతున్నారని అన్నారు. పేదల ఇండ్లు కూల్చుతుంటే కేంద్ర మంత్రి  కిషన్‌‌రెడ్డి ఎక్కడికి వెళ్లారని కేటీఆర్​ ప్రశ్నించారు. కిషన్‌‌రెడ్డి, రేవంత్‌‌రెడ్డి ఇద్దరూ కూడబలుక్కున్నారా? అని అడిగారు. 

కేటీఆర్​ను అడ్డుకున్న కాంగ్రెస్​ కార్యకర్తలు

గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్‌‌లో కేటీఆర్‌‌ కారును కాంగ్రెస్​ కార్యకర్తలు అడ్డుకున్నారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపైనా కేటీఆర్​ స్పందించారు. పేద ప్రజల తరఫున తాను ఉన్నన్ని రోజులు ఏ బుల్డోజర్లు తమ గొంతును ఆపలేవని చెప్పారు.  గూండా రాజ్యాన్ని సవాలు చేసే తన స్ఫూర్తిని ఏ గూండాలు అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లం కాదని, తాట తియ్యడానికే వచ్చానని అన్నారు. 

తెలంగాణ ప్రజల గళం రాహుల్​కు వినిపించడంలేదా?

రాష్ట్రంలో బుల్డోజర్​కూల్చివేతలపై రాహుల్‌‌ గాంధీని ఉద్దేశించి  కేటీఆర్ ఎక్స్​లో ట్వీట్ చేశారు. బుల్డోజర్ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల గళం రాహుల్ గాంధీకి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. సమస్యలు వస్తే యువత, ప్రజలు, చిన్నారి అయినా సరే పిలిస్తే వస్తానని తుక్కుగూడ కాంగ్రెస్ సభలో రాహుల్‌‌ గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సదరు వీడియోను ఎక్స్‌‌లో పోస్ట్​ చేశారు. రాహుల్‌‌ గాంధీ ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడి తెలంగాణకు వచ్చి మూసీ ప్రాజెక్టు ప్రభావిత ప్రజలను కలవాలని కోరారు. ఇక ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 23 సార్లు హైద్రాబాద్-– సికింద్రాబాద్‌‌కు తిరిగినట్టు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎంకు తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 5 లక్షల మంది రైతన్నలు 2 లక్షల రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని, 67 లక్షల మందికి పైగా రైతన్నలు రైతుబంధు కోసం కండ్లు కాయలు కాసేలా చూస్తున్నారని అన్నారు.