- కొత్త యాప్‌తో డ్రగ్స్, గంజాయి సప్లయర్ల ట్రాక్
- టీఎస్ కాప్, సీసీటీఎన్‌ఎస్‌తో డోపమ్స్ అనుసంధానం
- అఫెండర్ ప్రొఫైల్స్‌తో కట్టడి చేస్తున్నటీ న్యాబ్ పోలీసులు
- గత 7 నెలల్లో 329 మంది అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని కట్టడి చేసేందుకు టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నది. సప్లయర్లు, కస్టమర్ల డేటా ఆధారంగా డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ట్రేస్ చేస్తున్నది. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్లతో పాటు గంజాయి సాగు ఎక్కువగా చేసే ఏపీ, ఒడిశా రాష్ట్రాల పోలీసులతో గంజాయి సప్లయర్ల కదలికలు గుర్తిస్తున్నది.
కస్టమర్లపై నిఘా పెట్టి వారికి డ్రగ్స్, గంజాయి సప్లయ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎన్‌డీపీఎస్ యాక్ట్ కేసుల డేటాను ‘డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ (డోపమ్స్) యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నది. దీంతో డ్రగ్స్ సప్లయర్లు దేశంలో ఎక్కడ పట్టుబడినా వెంటనే గుర్తిస్తున్నారు. ఈ సిస్టమ్‌తో గత ఏడు నెలల వ్యవధిలో రాష్ట్ర పోలీసులు దాదాపు 329 మంది సప్లయర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లను ట్రాక్ చేసేందుకు 2021 సెప్టెంబరులో రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో ‘డోపమ్స్’ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 746 పోలీస్ స్టేషన్లు, టీఎస్ కాప్ యాప్, క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్) తో డోపమ్స్ ను అనుసంధానం చేశారు. దీంతో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్‌డిపీఎస్) కేసుల ప్రొఫైలింగ్ మానిటరింగ్, విశ్లేషణ చేస్తున్నారు.
డ్రగ్స్, గంజాయి కేసుల్లో అరెస్టయిన నిందితుల పేరు, స్వస్థలం, ఆధార్, కుటుంబ సభ్యుల వివరాలతో పాటు కస్టమర్లకు పాటు సంబంధించిన డేటా బేస్‌ను కూడా అప్‌లోడ్ చేస్తున్నారు. డ్రగ్స్ హాట్ స్పాట్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 329 మంది డ్రగ్స్, గంజాయి సప్లయర్లను గుర్తించి అరెస్టు చేశారు. డ్రగ్స్‌తో పాటు గంజాయి పెడ్లర్ల లిస్టును టీఎస్ కాప్స్ యాప్‌లో అందుబాటులో పెడుతున్నారు. ఇలా పెడ్లర్లు, కస్టమర్లపై నిఘా పెడుతూ డ్రగ్స్ చైన్‌ను ఛేదించేందుకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.