నల్గొండ జిల్లాలో బ్లడ్​ కొరత

  • కోదాడ, హుజూర్ నగర్ లో బ్లడ్ బ్యాంక్ లేక ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు​​​
  • ఆపద సమయంలో రక్తం దొరక్క అవస్థలు
  • బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే.. రెండు నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం

సూర్యాపేట, వెలుగు : జిల్లా ఏర్పడి 10 ఏండ్లు గడుస్తున్నా రక్తం దొరక్క పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ -– విజయవాడ జాతీయ రహదారి సూర్యాపేట జిల్లాలో ఉండడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. జిల్లాలో ఒకే ఒక్క బ్లడ్ బ్యాంక్ ఉండడంతో రక్తం కొరత తీవ్రంగా ఉంది. ఇటీవల కోదాడలో బ్లడ్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు చేసినా సూర్యాపేటలోని బ్లడ్ బ్యాంక్ నుంచే తరలించాల్సి వస్తుంది. దీనితో జిల్లాలో మరో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది.  

జిల్లాలో 10 లక్షల జనాభా..

సూర్యాపేట జిల్లాలో 10 లక్షలకు పైగా జనాభా ఉంది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు, మూడు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి. రెండు రెవెన్యూ డివిజన్లు అయిన కోదాడ, హుజూర్ నగర్ జాతీయ రహదారులపై ఉన్నాయి. ఈ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు జరిగే క్షతగాత్రులు తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. సూర్యాపేటలో మినహా కోదాడ, హుజూర్ నగర్​లో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లు లేవు. ప్రమాదాలు జరిగితే రక్తదాతల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వారు అందుబాటులో లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కోదాడలో బ్లడ్ స్టోరేజ్ పాయింట్..

ఇటీవల కోదాడ, హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రులను ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఆధ్వర్యంలో కోదాడ, హుజూర్ నగర్ ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. కోదాడ ఆస్పత్రిని 100 పడకలుగా అప్ గ్రేడ్ చేయగా, ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగితే ప్రాణనష్టం జరగకుండా నివారించేందుకు ట్రామా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 100 పడకల ఆస్పత్రిగా ఉన్న హుజూర్ నగర్ లో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. 

అయితే, కోదాడ లో బ్లడ్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు చేయనుండగా, సూర్యాపేట బ్లడ్ బ్యాంక్ నుంచే అక్కడికి తరలించాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ప్రయోజనం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రెండు ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో అత్యవసర సమయాల్లో రోగులకు రక్తం లభించడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందుతాయని స్థానికులు చెబుతున్నారు. వీటితోపాటు ఇటీవల తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిని సైతం 100 పడకలుగా అప్ గ్రేడ్ చేయడంతో అక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.