
Sensex-Nifty Crash: కొత్త నెల మెుదటి వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాలతో మార్కెట్లపై వాణిజ్య యుద్ధ భయాలు కమ్ముకోవటంతో నేడు భారతీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఇదే క్రమంలో ప్రపంచ దేశాల మార్కెట్లు కూడా ప్రతికూలంగా కొనసాగటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి.
సాయంత్రం మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 931 పాయింట్లు పతనం కాగా, మరో కీలక సూచీ నిఫ్టీ 346 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 95 పాయింట్లతో ప్రయాణాన్ని ముగించగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 1516 పాయింట్ల పనతాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో స్మాల్ క్యాప్ సూచీ కూడా భారీగానే నష్టాలను నమోదు చేసింది. ప్రధానంగా నేడు వారాంతపు ఆప్షన్ ఎక్స్ పెయిరీతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూలతలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. దీంతో మార్కెట్లో అనేక కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
Also Read:-లేఆఫ్ చేసి కొత్త ఉద్యోగాలిప్పించాడు..!
ముందుగా ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని కంపెనీలు భారీ అమ్మకాల ఒత్తిడిని చూశాయి. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను కొనసాగించటం మార్కెట్లపై ప్రతికూలంగా ప్రభావాన్ని చూపింది. ఐటీ సూచీ 9 శాతం పతనంతో కరోనా తర్వాత తొలిసారిగా ఒకవారంలో ఇంత భారీ పతనాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ టారిఫ్స్ ప్రతికూల ప్రభావాల దృష్ట్యా ఐటీ రంగంలోని కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడి నష్టపోయాయి.
నేడు మార్కెట్ల పతనంతో పెట్టుబడిదారుల సంపద బీఎస్ఈలో రూ.10 లక్షల కోట్ల వరకు తగ్గుదలను నమోదు చేసింది. మార్కెట్ల ముగింపు నాటికి నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, సిప్లా స్టాక్స్ అత్యధికంగా నష్టాలను నమోదు చేశాయి. ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.
రంగాల పరంగా మెటల్ ఇండెక్స్ 6.5 శాతం, ఫార్మా ఇండెక్స్ 4 శాతం, రియాలిటీ ఇండెక్స్ 3.6 శాతం, ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ దాదాపు 4 శాతం పడిపోయాయి. అలాగే.. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పవర్, పీఎస్‌యూ కంపెనీలు, మీడియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు 2-3 శాతం నష్టాన్ని నమోదు చేశాయి.