దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది.. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నరు: ప్రధాని మోదీ

దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది.. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నరు: ప్రధాని మోదీ
  • టెర్రరిస్టులు, కుట్రదారులను శిక్షిస్తం
  • పహల్గాం బాధితులకు న్యాయం జరుగుతది
  • ప్రపంచం మొత్తం ఇండియాకు అండగా నిలబడింది
  • కాశ్మీర్ అభివృద్ధి చూసి పాక్​ ఓర్వలేకపోతున్నదని ఫైర్​

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్ట్ దాడితో దేశంలోని ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అటాక్​లో ప్రాణాలు కోల్పోయిన అందరి కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. 26 మంది అమాయకులను చంపిన టెర్రరిస్టులతో పాటు కుట్రదారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రతీకారం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్నదని తెలిపారు. ఆదివారం ‘మన్‌‌కీ బాత్‌‌’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.

‘‘పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ నన్ను ఎంతగానో కలిచివేసింది. ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ యుద్ధంలో 140 కోట్ల మంది భారతీయుల ఐక్యత, సంఘీభావమే అతిపెద్ద బలం. ఎంతో అందమైన కాశ్మీర్​లో ఉగ్రదాడి.. మన శత్రువు (పాకిస్థాన్) పిరికిపంద చర్య. లోయలో శాంతిని స్థాపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి. యువత ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. ప్రజాస్వామ్యం బలపడుతున్నది. పర్యాటకం పెరుగుతున్నది. ప్రజల ఆదాయం పెరుగుతున్నది. జమ్మూ కాశ్మీర్​లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నరు. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరోసారి నాశనం చేయాలనుకుంటున్నరు.అందుకే పెద్ద కుట్ర అమలు చేశారు’’అని మోదీ అన్నారు.

గ్లోబల్ స్పేస్ పవర్‌గా ఇండియా
ఇండియా గ్లోబల్ స్పేస్ పవర్‌‌‌గా ఉద్భవించిందని, ఒకే ప్రయోగంలో 104 శాటిలైట్లను విజయవంతంగా నింగిలోకి పంపి రికార్డు సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే, చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొదటిసారి దిగిన దేశంగా ఇండియా నిలిచిందని చెప్పారు. స్పేస్ స్టార్టప్ సెక్టార్​లో యువత కొత్త మైలు రాళ్లను సాధిస్తున్నారన్నారు. ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ మృతిపై నివాళులర్పించారు. కస్తూరి రంగన్ సేవలను కొనియాడారు.

సైన్స్, ఎడ్యుకేషన్, స్పేస్ ప్రోగ్రామ్స్​లో దేశం కొత్త శిఖరాలను అధిరోహించడంలో కస్తూరి రంగన్ కీలక పాత్ర పోషించారన్నారు. 1975లో ఇండియా తొలి శాటిలైట్ ఆర్యభట్టను ప్రయోగించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని మోదీ గుర్తు చేశారు.

ఈ సందర్భంగా ఇండియన్ స్పేస్ సైంటిస్టుల కృషిని కొనియాడారు. స్పేస్ సెక్టార్​లో ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పించడం ద్వారా యువత స్పేస్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో సరికొత్త విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. దేశంలోని వివిధ వ్యక్తులు, సంస్థల స్ఫూర్తిదాయక విజయ కథనాలను మోదీ గుర్తు చేశారు. ముఖ్యంగా సాంకేతికత, పర్యావరణ రంగాల్లో జరుగుతున్న ప్రగతిని ప్రశంసించారు.

మన బలమైన సంకల్ప శక్తిని ప్రదర్శించాలి
రాష్ట్రం, భాషతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు బాధిత కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ‘‘దేశం ముందు ఉన్న ప్రతి సవాల్​ను ధీటుగా ఎదుర్కొనేందుకు సంకల్పం తీసుకోవాలి. ఒక దేశంగా మన బలమైన సంకల్ప శక్తిని ప్రదర్శించాలి. పహల్గాం దాడి తర్వాత దేశం మొత్తం ఒకే గొంతుక వినిపించడం ప్రపంచం మొత్తం చూస్తున్నది.

ప్రపంచ దేశాలన్నీ ఈ దాడిని ఖండించాయి. ఎంతో మంది గ్లోబల్ లీడర్లు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. కొందరు లేఖలు రాశారు. సందేశాలు పంపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో.. 140 కోట్ల మంది భారతీయులకు ప్రపంచం మొత్తం అండగా నిలిచింది’’అని మోదీ అన్నారు.