
న్యూఢిల్లీ: రెండేండ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. చంద్రుడు ముదురు ఎరుపు రంగులోకి మారిపోయాడు. దీన్ని ‘బ్లడ్ మూన్’గా పిలుస్తారు. ఇది అమెరికా, పశ్చిమ యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో ఆవిష్కృతమైంది. ప్రాంతాలను బట్టి గురు, శుక్రవారాల మధ్య ఆయా ఏరియాల్లో బ్లడ్ మూన్ కనిపించింది.
దాదాపు 65 నిమిషాల పాటు చంద్రగ్రహణం కొనసాగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చంద్రగ్రహణం ఏర్పడిన టైమ్‌లో మన దేశంలో మధ్యాహ్నం కాబట్టి, అది మనకు కనిపించలేదు. కాగా, ఇదే ఏడాది సెప్టెంబర్ 7, 8న మరోసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ టైమ్‌లోనూ ‘బ్లడ్ మూన్’ ఏర్పడుతుందని, దాదాపు గంటా 22 నిమిషాల పాటు గ్రహణం కొనసాగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు.