- డ్రైనేజీలోంచి పొంగి వీధుల్లోకి..! పరిశ్రమల నిర్వాకం.. బెంబేలెత్తుతున్న జనం
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో కాలుష్య వరద పొంగుతున్నది. ఇందుకు నిలువెత్తు సాక్ష్యం జీడిమెట్ల వెంకటాద్రినగర్ కాలనీలో సోమవారం రాత్రి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగి రక్తపు రంగులో బయటకు రావడమే. వెంకటాద్రినగర్, ప్రాగాకాలనీ నివాసప్రాంతాల్లో కొంత మంది అక్రమంగా పరిశ్రమలు స్థాపించారు. ఇందులో అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి.
ఇందులో ఉత్పత్తుల అనంతరం వచ్చే వ్యర్థ రసాయనాలను గుట్టుచప్పుడు కాకుండా డ్రైనేజీలోకి పంపుతున్నారు. కొన్ని సార్లు డ్రైనేజీ పొంగి వ్యర్థరసాయనాలు రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రాత్రి ఒక్కసారిగా రోడ్డుపైకి రక్తపు రంగులో నీళ్లు బయటకు రావడంతో భయపడ్డారు. కాగా, ఆ వ్యర్థరసాయనాల నమూనాలను మంగళవారం పీసీబీ సిబ్బంది సేకరించారు. ల్యాబ్‌కి పంపించి ఫలితాల వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. పీసీబీ సిబ్బంది రావడంతో అక్కడి పరిశ్రమల నిర్వాహకులు పరిశ్రమలకు తాళాలు వేసుకుని పారిపోయారు.