సంగారెడ్డి జీజీహెచ్​లో బ్లడ్ షార్టేజ్ .. రక్తదానం చేయాలని ఆఫీసర్ల ప్రచారం

సంగారెడ్డి జీజీహెచ్​లో బ్లడ్ షార్టేజ్ .. రక్తదానం చేయాలని ఆఫీసర్ల  ప్రచారం
  • నెగటివ్ గ్రూపుల రక్తానికి తీవ్ర ఇబ్బందులు
  • దాతల క్యాంపులపైనే ఆధారం

సంగారెడ్డి, వెలుగు: జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్​జనరల్ హాస్పిటల్​(జీజీహెచ్) బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు ఖాళీ అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జీజీహెచ్​లో మాత్రమే బ్లడ్ సెంటర్ ఉండగా జహీరాబాద్, నారాయణఖేడ్ గవర్నమెంట్​ హాస్పిటల్స్​కు ఇక్కడి నుంచే బ్లడ్ పంపిస్తారు. ప్రస్తుతం రక్తం కొరత కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉచితంగా రక్తం ఇవ్వాలంటే ఇతరుల నుంచి సేకరించాల్సిన పరిస్థితి నెలకొంది. నెగటివ్ గ్రూపుల రక్తానికి తీవ్ర కొరత ఉండగా పాజిటివ్ గ్రూపుల రక్త నిల్వలు కూడా తక్కువగానే ఉన్నాయి. 

సంగారెడ్డి జీజీహెచ్​లో.. 

సంగారెడ్డి జీజీహెచ్​లో పేషెంట్ల అవసరాలను బట్టి 150 నుంచి 300 యూనిట్ల రక్తం నిల్వలు ఉంచేవారు. ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి నెలకు 300 యూనిట్ల రక్తాన్ని ఇతరులకు ఇచ్చేందుకు బాధితులు తీసుకెళ్తుంటారు. సోమవారం నాటికి సంగారెడ్డి జీజీహెచ్​బ్లడ్ బ్యాంకులో 141 యూనిట్ల రక్త నిల్వలు ఉన్నాయి. వారం రోజుల క్రితం కేవలం 58 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండగా వైద్యులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్త నిల్వలు పెంచారు. ఈ హాస్పిటల్​లో ప్రతిరోజు కనీసం 30 శస్త్ర చికిత్సలు, కాన్పులు అవుతుంటాయి. ఇటీవల ప్రసవాల కోసం వచ్చే గర్భిణీల సంఖ్య బాగా పెరిగింది. గవర్నమెంట్​హాస్పిటల్స్​కు వచ్చే పేషెంట్లకు ఉచితంగా రక్తం ఇవ్వాలి. కానీ రక్తం కొరత కారణంగా రోగి బంధువుల్లో ఒకరు డోనర్ గా మారితేనే వారి నుంచి రక్తం తీసుకుని హాస్పిటల్​లో నిల్వ ఉన్న రక్తాన్ని ఇస్తున్నారు. 

పెరుగుతున్న బ్లడ్ డొనేషన్ క్యాంపులు

వేసవిలో ఎక్కువగా రక్త నిల్వల కొరతలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు జిల్లా యంత్రాంగం వైద్యుల సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహిస్తోంది. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం నారాయణఖేడ్, సంగారెడ్డిలో మెడికల్ క్యాంపులు నిర్వహించి  కొంత మేర రక్తాన్ని సేకరించారు. రెండో విడతగా జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఈ నెల 16న బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. రక్తం ఇవ్వడానికి యువత ముందుకు రావాలని వైద్యులు కోరుతున్నారు.

 ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో..

సంగారెడ్డి లో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు 5 ఉన్నాయి. గవర్నమెంట్ ​హాస్పిటల్​లో కొన్ని గ్రూపుల బ్లడ్ అందుబాటులో లేకుంటే బాధితులు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. వారు బ్లడ్​ గ్రూప్​ను బట్టి ప్యాకెట్ ధర రూ.1100 చార్జ్ చేస్తున్నారు. గవర్నమెంట్​ హాస్పిటల్​ నుంచి వచ్చిన వారి దగ్గర కూడా ఇదే రేటు వసూలు చేస్తున్నారు.  గవర్నమెంట్ ​హాస్పిటల్​లో రక్త నిల్వల కొరత ఉన్నప్పటికీ పేషెంట్ల అవసరాలను బట్టి రక్తం ఉచితంగా ఇస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. కానీ  క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి.