ఓరుగల్లులో రక్తం కొరత ఏర్పడింది. సమయానికి బ్లడ్ దొరకక హాస్పిటల్స్ లో పడిగాపులు కాస్తున్నారు రోగులు. సిటీలో ఆరు బ్లడ్ బ్యాంక్ లు ఉన్నా.. ఎక్కడికి వెళ్లినా ఒకే సమాధానం వస్తోంది. ఎండాకాలంలో బ్లడ్ డోనర్స్ ముందుకు రాకపోవడంతోనే కొరత ఏర్పడిందంటున్నారు డాక్టర్లు. మరోవైపు హాస్పిటల్ యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.
జిల్లాలో ఎంజీఎంతో పాటు వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఎంజీఎం, రెడ్ క్రాస్ సొసైటీ, కాకతీయ బ్లడ్ బ్యాంక్, మదర్ఎన్జీవో,సెయింట్ ఆన్స్, విమ్స్ పేర్లతో బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేసారు. గ్రామీణ ప్రాంతాల అవసరాల కోసం మహబూబాబాద్, జనగామ, ఏటూరు నాగారం, వర్థన్నపేట, ములుగులో బ్లడ్ బ్యాంక్ లు ఉన్నాయి. అయినా రక్తం కావాలంటే కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి ఉంది.
హన్మకొండ, వరంగల్, కాజీపేట సిటీల్లో 100 కు పైగా హాస్పిటల్స్ ఉండటంతో.. బ్లడ్ అవసరం పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ప్రతీ ఏటా 35 వేల యూనిట్ల బ్లడ్ అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతలు పెరగడంతో బ్లడ్ డోనర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. బ్లడ్ డోనేషన్ క్యాంపులు నిర్వహించే వారు కూడా… వేసవితో పాటు, ఎన్నికల వాతావరణం ఉండటంతో క్యాంపులు పెట్టడం లేదు.
రక్తంలో ప్రధానంగా నెగెటివ్ గ్రూప్ ల కొరత ఎక్కువగా ఉంది. ఒక్కోసారి పాజిటివ్ బ్లడ్ కూడా దొరకడం లేదు. సిటీలో ఉన్న ఆరు బ్లడ్ బ్యాంక్ లతో పాటు రూరల్ లో ఉన్న ఐదు బ్లడ్ స్టోరేజ్ యూనిట్లలో బ్లడ్ నిల్వలు ఉండటం లేదు. బ్లడ్ కోసం ఎక్కడికి వెళ్లినా దొరకడం లేదని రోగులు, వాళ్ల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. MGM లో కొందరికి బ్లడ్ దొరక్క సర్జరీలు వాయిదా వేసే పరిస్థితి ఏర్పడింది. .
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తలసేమియా బాధితులు 250 మంది ఉన్నారు. వీళ్లకి వారానికోసారి రక్తం మార్చాల్సి ఉన్నా.. నెలకోసారి కూడా ఛేంజ్ పరిస్థితి లేదు. అటు బ్లడ్ తక్కువగా ఉన్న గర్భిణీలు, క్యాన్సర్ పేషంట్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో రోగులు బెడ్ పై ఉంటే…వాళ్ల బంధువులు బ్లడ్ బ్యాంకుల చుట్టూ పరుగులు తీస్తున్నారు. సరైన గ్రూప్ దొరక్కపోతే వేరే బ్లడ్ ఇచ్చి కావాల్సిన గ్రూప్ ను తీసుకుంటున్నారు.
ఎంజీఎంలో తాము వేరే గ్రూప్ రక్తమిచ్చినా.. అవసరం ఉన్న రక్తం ఇస్తామని చెప్పి టైమ్ కు ఇవ్వడం లేదంటున్నారు రోగుల బంధువులు.
-రాజేందర్, పేషంట్ బంధువు
తమ దగ్గర ఉన్న బ్లడ్ ను ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నామంటున్నారు MGM బ్లడ్ బ్యాంక్ ఇంఛార్జ్. ఎండా కాలంలో ఎవరూ బ్లడ్ ఇవ్వడం లేదని చెబుతున్నారు.