మనిషి గుండె పిడికిలి పరిమాణంలో ఉంటుందని చదివాం. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద జీవి, సముద్రాన్ని పాలించే రారాజు నీలి తిమింగిలం గుండె ఎంతుండొచ్చు..? అనే ఆలోచన మీకెప్పుడేనా వచ్చిందా? ఆ డౌట్ క్లియర్ కావాలంటే కెనడాలోని రాయల్ అంటారియో మ్యూజియానికి వెళ్లాల్సిందే..
రాయల్ అంటారియో మ్యూజియంలో.. 200 టన్నుల బరువుండే (33 ఏనుగులకు సమానం) బ్లూవేల్ గుండెను భద్రపరిచారు. ఆ గుండె సుమారుగా 181 కిలోల బరువుంటుంది. 1.5 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. తిమింగలం గుండె కొట్టుకుంటే ఆ చప్పుడు ఏకంగా 3 కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది. ఈ విషయాలన్నీ హర్షా గోయెంకా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లిడించారు. అచ్చం మనిషి గుండెను పోలిన విధంగా ఉంది ఆ తిమింగలం గుండె.
2014లో కెనడాలోని వెస్ట్రన్ న్యూఫౌండ్ ల్యాండ్‌లోని రాకీ హార్బర్ సిటీ సముద్ర తీరానికి ఓ ఆడ తిమింగలం మృతదేహం కొట్టుకు వచ్చింది. ఆ తిమింగలం కలేబరం నుంచి గుండెను వేరుచేసి మ్యూజియానికి తరలించారు. 2017 నుంచి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.