జైపూర్: పరీక్షల్లో ఎలాగైనా పాస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు విద్యార్థులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సమాధానాలను స్లిప్స్ పెట్టుకొని, మరికొందరు ఎలక్ట్రానిక్ డివైజ్ లను తెచ్చుకొని అడ్డంగా దొరికిపోతారు. ఇలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్ లో జరిగింది. చెప్పుల్లో బ్లూటూత్ పెట్టుకుని రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జాగామినేషన్ కు హాజరైన ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా వీరిలో ఒకర్ని అజ్మీర్ లో అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించడంతో ఇదో రాకెట్ అని పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధం ఉన్న మరో నలుగుర్ని అరెస్టు చేశారు.
ఒక్కో జతకు రూ.2 లక్షలు
'చెప్పుల్లో ఫోన్ తోపాటు బ్లూటూత్ ను కూడా దాయొచ్చు. దొరికిపోయిన అభ్యర్థి చెవిలో ఒక డివైజ్, చెప్పులో ఫోన్ దొరికింది. బయటి నుంచి మరో వ్యక్తి అతడికి సాయం చేస్తున్నాడనిగుర్తించాం. ఇదో రాకెట్' అని రతన్ లాల్ అనే పోలీసు అధికారి చెప్పారు. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ చీటింగ్ చెప్పులను తెలివిగా తయారు చేస్తున్నారని విచారణలో తేలింది. ఇలాంటి చెప్పులను హార్డ్ వేర్ తో కలిపి ఒక్కో జతను రూ.2 లక్షలకు అమ్ముతున్నట్లు సమాచారం.