Team India Victory Parade: విక్టరీ పరేడ్‌ ఎఫెక్ట్.. ముంబై రోడ్‌లో 11,000 కిలోల వ్యర్ధాలు

Team India Victory Parade: విక్టరీ పరేడ్‌ ఎఫెక్ట్.. ముంబై రోడ్‌లో 11,000 కిలోల వ్యర్ధాలు

విక్టరీ పరేడ్ లో భాగంగా భారత T20 ప్రపంచకప్ జట్టును చూసేందుకు ముంబైలో లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుకను చూడడానికి లక్షలాది మంది అభిమానులు ముంబై సముద్రపు ఒడ్డుకు విచ్చేశారు. నారీమన్‌ పాయింట్‌ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఎటుచూసినా జనం. రోజూ సాయంత్ర వేళల్లో ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతమంతా ఇసుకేస్తే రాలనంత జన ప్రభంజనాన్ని తలపించింది. జనాలు విపరీతంగా రావడంతో మెరైన్ రోడ్ వ్యర్ధాలతో నిండిపోయింది. 

విక్టరీ పరేడ్ ముగిసిన తర్వాత బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ 11,500 కిలోల వ్యర్థాలను సేకరించినట్టు సమాచారం. బూట్లు  దుస్తులు, ప్లాస్టిక్ బాటిళ్లతో ఈ రోడ్ నిండిపోయింది. ఈ మెరైన్ డ్రైవ్‌ను క్లీన్ చేయడానికి 100 మంది సిబ్బందితో పాటు 25 మంది స్వచ్ఛంద సంస్థల సిబ్బంది అవసరం ఏర్పడిందని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. బీఎంసీ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. “ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో రోడ్ అంతా అపరిశుభ్రంగా మారిపోయింది. డ్రైవ్ ఉదయం 8 గంటలకు పూర్తయింది. మేము వ్యర్థాలను ఒక కాంపాక్టర్, ఒక డంపర్, ఐదు SCBVలలో క్లియర్ చేసి లోడ్ చేసాము". అని ఆయన అన్నారు. 

బీఎంసీ అధికారి ప్రకారం.. ఒక డంపర్ సామర్థ్యం మూడు మెట్రిక్ టన్నులు.. ఒక కాంపాక్టర్ ఆరు మెట్రిక్ టన్నుల వ్యర్థాలను కలిగి ఉంటుంది. ఇక ఒక్కో SCBV 500 కిలోల హోల్డింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వచ్ఛత కార్యక్రమం ముగిసింది. బీఎంసీ పని తీరుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్క నైట్ లోనే క్లీన్ చేసింనందుకు వీరి పని తీరును మెచ్చుకుంటున్నారు.