- బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్యాదగిరి సత్తయ్య
- దేశవ్యాప్తంగా బొగ్గు గనుల ఆందోళనలకు సిద్ధంకావాలని పిలుపు
కోల్బెల్ట్, వెలుగు: దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారానికి చేపట్టనున్న ఆందోళనకు సింగరేణి కార్మికులు సిద్ధం కావాలని బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్యాదగిరి సత్తయ్య పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే7 మైన్పై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణిలో నెలకొన్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం జాప్యం చేస్తోందని ఆరోపించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 40శాతం వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి 250 గజాల భూమి, 50 లక్షల వడ్డీ లేని రుణం, సొంతింటి పథకం అమలు చేయాలన్నారు.
సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించి వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందిని వెంటనే నియమించాలని కోరారు. కోల్ ఇండియా, సింగరేణి కంపెనీల్లో క్యాడర్ స్కీమ్‌లను సవరించాలని, బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న మహిళల సాధికారత కోసం కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కోలిండియా తరహాలో సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు బీఎంఎస్లో చేరగా వారికి యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. సమావేశంలో బీఎంఎస్ఏరియా ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్ రెడ్డి, కేంద్ర కార్యదర్శి రాగం రాజేందర్, బోయిన మల్లేశ్, కట్కూరు సతీశ్, గోళ్ల మహేందర్, గని పిట్ సెక్రటరీ మోతే ఓదెలు తదితరులు పాల్గొన్నారు.