సముద్రపు వంతెనపై BMW, బెంజ్ కార్ల పోటీ: కార్లను ఢీకొట్టి బీభత్సం

సముద్రపు వంతెనపై BMW, బెంజ్ కార్ల పోటీ: కార్లను ఢీకొట్టి బీభత్సం

ముంబై: ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి స్పోర్ట్స్ కార్లు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం (సెప్టెంబర్ 15) బాంద్రా -వర్లీ సీ లింక్‎పై మెర్సిడెస్,  బీఎమ్‌డబ్ల్యూ కార్లు పోటీపడ్డాయి. రయ్యు రయ్యుమంటూ దూసుకెళ్తున్న క్రమంలో బీఎమ్‌డబ్ల్యూ కారు అదుపు తప్పి మరో రెండు కార్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. కార్లు వర్లీ నుంచి బాంద్రాకు వెళ్తుండగా బాంద్రా-వర్లీ సీ లింక్‌లో ఈ ఘటన జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 రోడ్డుపై రేసింగ్ నిర్వహించిన స్పోర్ట్స్ కారు డ్రైవర్లు  షాబాజ్ ఖాన్ (31), తారిఖ్ చౌదరి (29)లను వర్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. బీఎమ్‌డబ్ల్యూ కారు వేగానికి రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇటీవల ముంబైలో హిట్ అండ్ రన్ కేసులు సంచలన రేపుతోన్న క్రమంలోనే మరోసారి స్పోర్ట్స్ కార్లు బీభత్సం సృష్టించడం గమనార్హం. రోడ్లపై నిర్లక్ష్యంగా అడ్డగోలుగా కార్లు నడిపి అమాయకుల ప్రాణాలు తీస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.